ఆరుగాలం కష్టపడి.. చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటను పొత్తిళ్లలో బిడ్డలా కాపాడుకుంటున్న రైతు తీరా ఆ పంట చేతికొచ్చాక దాన్ని అమ్ముకుందామంటే సవాలక్ష నిబంధనలు. పండించిన ధాన్యం అమ్ముకోవాలంటే వ్యవసాయశాఖ ద్వారా ఈ-క్రాప్‌లో నమోదై ఉండాలి. ఆ వివరాలన్నీ పౌర సరఫరాలు, మార్కెటింగ్‌శాఖల పోర్టల్‌కు అనుసంధానం కావాలి. ఇవన్నీ ఉన్నా ఈ-కేవైసీ తప్పనిసరి. అప్పుడే మద్దతు ధరపై (అది కూడా లెక్కల్లోనే) ధాన్యం ఇతర ఉత్పత్తులు అమ్ముకునే అవకాశం లభిస్తుంది. లేదంటే కష్టమే.
మరోవైపు ఏ పంటా వేయనివారు, స్థానికంగా నివసించని వారిలో కొందరి పేర్లు, ఆధార్ నంబర్లతో సహా ఈ-పంట, పౌర సరఫరాలశాఖ పోర్టళ్లలో కనిపిస్తున్నాయని, వారి పేర్లతో వేలాది బస్తాల ధాన్యం అమ్మకాలు, రూ.కోట్లలో లావాదేవీలు జరుగుతున్నాయని రైతులు మండిపడుతున్నారు. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై తమకు కావాల్సిన ఆధార్ నంబర్లు నమోదు చేయించి వారి పేరుతో విక్రయాలు చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరులో గతేడాది రైస్ మిల్లర్లు, రైతు భరోసా కేంద్రం నిర్వాహకులు, కొందరు అధికారులు కలిసి ధాన్యం కొనుగోలులో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడినట్లు ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ-క్రాప్‌లో పెద్ద కుంభకోణమే జరుగుతోందని తాజాగా అధికార పార్టీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. ఇందులో బడా వ్యాపారవేత్తలు, వారికి కొమ్ము కాస్తున్న అధికారులున్నారు అనడానికి తన దగ్గర స్పష్టమైన ఆధారాలున్నాయని ఆయన చెప్పారు. రికార్డులకు దొరక్కుండా రైతుల్ని దోచుకుంటున్న ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకూ ఎంపీ డిమాండు చేశారు. గోదావరి జిల్లాల్లోనే కాదు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే తరహా పరిస్థితులున్నాయి.
తిరిగి తిరిగి విసిగిపోతున్నారు..ఈ-క్రాప్‌లో నమోదు కోసం కొందరు రైతులు తిరిగి, తిరిగి విసిగి వేసారి మిన్నకుండిపోతున్నారు. మరికొందరయితే అందులో నమోదైనంతవరకే పంట అమ్ముకుని.. మిగిలింది బయట తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ఈ-పంట నమోదు, అమ్మకాల్లో అవకతవకల విషయం తెలిసినా వ్యవసాయ, పౌర సరఫరాలశాఖలు మౌనం వహిస్తున్నాయి. పంట పండించిన తాము రోజుల తరబడి తిరిగినా పట్టించుకోని పౌర సరఫరాలశాఖ ఉన్నతాధికారులు, కొనుగోలు కేంద్రాల సిబ్బంది.. మిల్లర్లు చెప్పిన పేర్లను నమోదు చేసి సొమ్ములు చెల్లిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఒక్కో గ్రామంలో సాగవుతున్న పంటకు, నమోదవుతున్న విస్తీర్ణానికి భారీ వ్యత్యాసం ఉంటోందని వివరిస్తున్నారు. ఈ క్రాప్ నమోదులో అవకతవకలు జరుగుతున్నా ఉన్నతాధికారులు అదే ప్రామాణికం అంటూ.. నిజమైన సాగుదారుల్ని ఇబ్బంది పెడుతున్నారని రైతులు పేర్కొంటున్నారు.
ఒక్కో గ్రామంలో వందల కొద్దీ:ఈ-క్రాప్ లోపాలు ప్రతి గ్రామంలోనూ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. పంట అమ్ముకునేందుకు రైతు సంబంధిత కేంద్రానికి వెళ్లినప్పుడే ఇవి బయటపడుతున్నాయి. ఈ-క్రాప్ చేయించుకోని రైతుల పేర్లతో ఇతరులు నమోదు చేయించుకుని అమ్ముకున్నా బయటకు రాదు. ఆన్‌లైన్‌లోనూ కనిపించదు. రైతులెవరో, ఈ-పంట ఎవరి పేరుతో నమోదైందో, ఎవరు అమ్ముకున్నారో అంతా వ్యవసాయ, పౌరసరఫరాలశాఖ అధికారులకే ఎరుక అన్నట్లుగా ఉంది. ఇటీవల ముగిసిన ఖరీఫ్ కాలంలో కోనసీమ జిల్లా రామచంద్రాపురం పరిధిలోనే సుమారు 600 ఎకరాల వరకు తేడాలొచ్చాయని అక్కడి రైతులు ‘ఈనాడు- ఈటీవీ’ ప్రతినిధులకు వివరించారు. ఒక రైతు పదెకరాల పొలంలో వరి సాగు చేస్తే.. మూడెకరాలు మాత్రమే అతని పేరుతో నమోదై కనిపిస్తోందని, మిగిలిన పొలాన్ని ఎక్కడో ఉన్న వారి ఆధార్ నంబర్‌తో అనుసంధానించారని రామచంద్రాపురానికి చెందిన జి.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ‘ధాన్యం అమ్ముదామని ఖరీఫ్‌లో రైతు భరోసా కేంద్రానికి వెళ్లా. డేటా రాలేదని రెండు నెలలు తిప్పి.. చివరకు తామేం చేయలేమని చేతులెత్తేశారు. దాళ్వా సమయంలో మళ్లీ వెళ్లి ఇప్పుడైనా చూడాలని కోరాం. ఆన్‌లైన్‌లో చూసి సూర్యప్రకాశరావు ఆధార్ తెమ్మన్నారు. ఆయనెవరో, ఎక్కడుంటారో మాకు తెలియదు. మా రైతు మేడిశెట్టి సుబ్బారావును అడిగితే ఆయనా తెలియదన్నారు. ఈ విషయాన్ని అధికారులకు చెబితే ఎక్కడో పొరపాటు జరిగిందంటున్నారు తప్ప సరిచేయడం లేదు’ అని గ్రామానికి చెందిన కౌలు రైతు కడలి కొండ వాపోయారు. మద్దతు ధరపై ధాన్యం అమ్ముదామని రైతు భరోసా కేంద్రానికి వెళ్తే డేటా రాలేదంటున్నారని కొత్తూరుకు చెందిన పిల్లి గోవింద్ వివరించారు. ‘ఈ-క్రాప్ చేశామని చెప్పినా.. మా దగ్గర చూపించడం లేదు, రాకపోతే మేమేం చేస్తామంటున్నారు’ అని పేర్కొన్నారు. ఇలా ధాన్యం అమ్మకాలకు యాతన పడలేక మిల్లర్లకు బస్తాకు రూ.200 తక్కువకు అమ్ముకుంటున్నామని పశ్చిమగోదావరి జిల్లా ప్రత్తిపాడుకు చెందిన పలువురు రైతులు వాపోయారు.
ఈ-క్రాప్ అంత రహస్యమా? :సాగు విస్తీర్ణంతో పోలిస్తే.. వాస్తవ ఈ-క్రాప్ నమోదు తక్కువగా ఉంటోంది. కొంతమంది రైతులు రైతు భరోసా కేంద్రానికి వచ్చి నమోదు చేయించుకోవడం లేదు. ధాన్యం సేకరణ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో.. కొందరు సిబ్బంది, వ్యాపారులు దీన్ని అవకాశంగా మలచుకుంటున్నారు. ఈ-క్రాప్ కాని సర్వే నంబర్లలో తమకు కావాల్సినవారి పేర్లు, ఆధార్ నంబర్లు నమోదు చేయిస్తున్నారు. ధాన్యం అమ్మకాల సమయంలో వారి పేర్లతోనే అమ్మినట్లు చూపిస్తున్నారు. ఇందుకు వేర్వేరు స్థాయిల్లో పెద్ద మొత్తం చేతులు మారుతోంది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 17 వేల మంది రైతుల చిరునామాలు దొరకడం లేదని అధికారులే చెబుతున్నారు. వ్యవసాయశాఖ పరిధిలో ఉండే ఈ-క్రాప్‌లో గ్రామంలో మొత్తం భూమి, సాగు విస్తీర్ణం, వేసిన పంటలు, ఈ-పంటలో నమోదైన మొత్తం ఎంతనే వివరాలేవీ బయటకు తెలియకుండా అంతా రహస్యం అన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.
పారదర్శకతకు పాతర :పౌర సరఫరాలశాఖలోనూ గతంలో జిల్లా, మండలం, గ్రామం వారీగా ఏ రైతు, ఎప్పుడు, ఎంత ధాన్యం అమ్మారు, ఎప్పుడు డబ్బు చెల్లించారో ఆన్‌లైన్‌లో కనిపించేవి. ఇప్పుడు ట్రక్ షీట్ నమోదు చేసిన రైతు వివరాలు మాత్రమే కన్పించేలా చేశారు. గ్రామంలో నివాసం ఉండనివారు, ఇతరుల పేర్లతో అమ్మకాలు జరిగినా స్థానికంగా ఎవరికీ తెలిసే అవకాశం లేకుండా చేశారు. కొందరికి ప్రయోజనం చేకూర్చేందుకు కావాలనే ఇలా చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.