Traffic Pending Challans : తెలంగాణలో వాహనాల పెండింగ్ చలాన్లపై రాయితీ ఆఫర్ ప్రారంభమైనప్పటి నుంచి.. ఈ-చలాన్ వెబ్‌సైట్ ద్వారా పెద్దసంఖ్యలో వాహనదారులు రుసుములు చెల్లిస్తున్నారు. ఈ ఆఫర్‌ను వినియోగించుకునేందుకు వాహనదారులు పోటీపడుతున్నారు. చలన్లా చెల్లింపు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రావటంతో తొలి 8 గంటల్లోనే లక్షా 77వేల చలానాలను వాహనదారులు క్లియర్ చేశారు. వీటి ద్వారా రూ.కోటి 77లక్షల రూపాయలు జమయ్యాయి. ఈ క్రమంలోనే.. ఒక్కసారిగా అధికసంఖ్యలో వెబ్‌సైట్‌ను తెరవడం వల్ల సర్వర్లపై భారం పడి సాంకేతిక సమస్య తలెత్తింది.
సమయానుకూలంగా చెల్లించండి..
పేమెంట్ గేట్ వే వద్ద ఎక్కువగా సమస్య వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఈ నెల 31 వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. వెబ్సైట్లోనూ ఈ విషయాన్ని పొందుపరిచారు. నెల రోజుల సమయం ఉంది కాబట్టి.. సమయానుకూలంగా జరిమానా చెల్లించాలని పోలీసులు సూచిస్తున్నారు.
దేనికెంత రాయితీ అంటే..
హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ చలానాల రాయితీలు అమల్లోకి వచ్చాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 75 శాతం, కార్లు, లారీలకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 70శాతం, తోపుడు బండ్లకు 80 శాతం రాయితీతో పెండింగ్ చలాన్లను చెల్లించే అవకాశాన్ని పోలీసులు కల్పించారు. కొవిడ్ నిబంధనల్లో మాస్క్ ధరించని వారికి విధించిన జరిమానాల్లో 90 శాతం రాయితీ కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 1750 కోట్ల రూపాయల చలాన్లు పెండింగ్ ఉన్నాయి.
ఎలా చెల్లించాలంటే..?
వాహనదారులు తమ చలానాలను ట్రాఫిక్ ఈ-చలానా వెబ్‌సైట్, ట్రాఫిక్ పోలీస్ వెబ్‌సైట్ ద్వారా లేదా.. నేరుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చెల్లించవచ్చు. వెబ్‌సైట్లలో లోక్‌అదాలత్ ఆప్షన్‌ను ఎంచుకోగానే.. రాయితీ పోనూ కట్టాల్సి సొమ్ము చూపిస్తుంది. ట్రాఫిక్ పోలీసుల వెబ్‌సైట్‌తో పాటు మీ సేవలో చలాన్లు చెల్లించే అవకాశాన్ని పోలీసులు కల్పించారు. సాంకేతిక సమస్య తలెత్తకుండా సర్వర్లను సామర్థ్యం పెంచిన ట్రాఫిక్ పోలీసులు... యూపీఐ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. వాహనదారుల సౌలభ్యం కోసం ఈ నెల 31వరకు రాయితీపై చెల్లించే అవకాశాన్ని ట్రాఫిక్ పోలీసులు కల్పించారు.
ఇదీ చదవండి:ఆ జాతరలో వేషం వేయాల్సిందే... జోలె పట్టాల్సిందే... అట్లైతేనే మెుక్కు చెల్లుతుంది