Train Travel: దసరా పండగకు నెల రోజులకు పైగా సమయం ఉన్నప్పటికీ.. రైళ్లలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు రిజర్వేషన్లు దొరకడం గగనమైపోయింది. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లల్లో సీట్లు, బెర్తులు దాదాపుగా అయిపోయాయి. కొన్ని రైళ్లలో నిరీక్షణ జాబితా (వెయిటింగ్ లిస్టు) టికెట్ల పరిమితి దాటిపోయింది. అక్కడక్కడ ఏసీ రైళ్లకు, డైనమిక్ ఛార్జీల విధానంలోను టికెట్లు ఉన్నప్పటికీ సామాన్యులు, పేదలు కొనలేని పరిస్థితి ఉంది.
అక్టోబరు 1 నుంచే రద్దీ:అక్టోబరు 5న దసరా.. 1వ తేదీ శనివారం కావడంతో ఆరోజు సాయంత్రం నుంచే చాలామంది ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రైల్వే జోన్ల మధ్య సమన్వయం లేకపోవడంతో రద్దీకి తగ్గట్లు ప్రత్యేక రైళ్లు నడిపించలేని పరిస్థితి నెలకొంది. కొన్నిసార్లు పండగ ప్రయాణానికి ఒకటి, రెండు రోజుల ముందు కొంతమేర ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తున్నా అవి ఏ మూలకూ సరిపోవడం లేదు. హైదరాబాద్ నుంచి అక్టోబరు 1న బయల్దేరే రైళ్లలో దాదాపుగా రిజర్వేషన్లు అయిపోయాయి. ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం వైపు వెళ్లే కోణార్క్, ఈస్ట్‌కోస్ట్, గోదావరి, గరీబ్‌రథ్, ఎల్‌టీటీ కురుక్షేత్ర, గౌతమి, దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌లలో ఒక్కో దాంట్లో వందల్లో వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఫలక్‌నుమా, సికింద్రాబాద్-గువాహటి ఎక్స్‌ప్రెస్‌ల్లో వెయిటింగ్ లిస్ట్ పరిమితి దాటిపోయింది. ఈ తేదీల్లో అక్టోబరు 2-4 వరకు విశాఖపట్నం వెళ్లే దురంతో, గరీబ్‌రథ్ వంటి ఏసీ రైళ్లలో మాత్రమే కొద్దిమేర టికెట్లున్నాయి. బెంగళూరు నుంచి విజయవాడ వైపు అక్టోబరు 1న ప్రశాంతి, కొండవీడు, గరీబ్‌రథ్, సంఘమిత్ర సహా ఎనిమిది రైళ్లుంటే.. ఏ ఒక్క బండిలోనూ ఖాళీల్లేవు. ఒక్కో రైలులో వందల్లో నిరీక్షణ జాబితా ఉంది. ఒక్క ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లోనే 606 వెయిటింగ్ లిస్ట్ ఉంది. యశ్వంత్‌పుర్-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్‌లో నిరీక్షణ జాబితా 428కి చేరింది. త్రీటైర్, టూటైర్ ఏసీల్లోనూ నిరీక్షణ పరిమితి దాటిపోయింది.