పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన రూ.7 వేల కోట్ల బకాయిలను డిస్కంలు 12 వాయిదాల్లో చెల్లించనున్నాయి. దీని ప్రకారం ప్రతి నెలా సుమారు రూ.600 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు భారీగా ఉన్న బకాయిలను ఒకేసారి చెల్లించడం డిస్కంలకు భారంగా మారుతున్న ఉద్దేశంతో వాయిదా పద్ధతిలో చెల్లించేలా వెసులుబాటు కల్పించడానికి లేట్ పేమెంట్ స్కీమ్ (ఎల్‌పీఎస్)ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం బకాయి మొత్తాన్ని 12 వాయిదాల్లో తీసుకోవడానికి ఉత్పత్తి సంస్థలు కూడా అంగీకరించాయని కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ పద్మాజనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈ నెల నుంచే వాయిదా మొత్తాన్ని చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లోని ఉత్పత్తి సంస్థలకు ఉన్న బకాయిలను వాయిదాల్లో చెల్లించేలా డిస్కంలకు వెసులుబాటు కల్పించడానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఎల్‌పీఎస్ పథకాన్ని రూపొందించింది.
ఏళ్ల తరబడి వివాదం:పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో డిస్కంలు కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ప్రకారం యూనిట్‌కు రూ.4.84 వంతున చెల్లించాలి. ఇది భారంగా ఉందని, యూనిట్ ధర తగ్గించాలని డిస్కంలు హైకోర్టులో పిటిషన్ వేేశాయి. తుది తీర్పు వచ్చే వరకు యూనిట్‌కు రూ.2.43 వంతున చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దీని ప్రకారం 2018 జూన్ నుంచి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి తీసుకునే విద్యుత్‌కు యూనిట్‌కు రూ.2.43 వంతున డిస్కంలు చెల్లిస్తున్నాయి. కేసు విచారణ ముగించిన కోర్టు పీపీఏ ప్రకారం పూర్తి మొత్తాన్ని నాలుగు వారాల్లోగా చెల్లించాలని గత మార్చి 15న తీర్పిచ్చింది. ఉత్పత్తి సంస్థల నుంచి తీసుకున్న విద్యుత్‌కు రూ.4,800 కోట్లు, పీపీఏ నిబంధన ప్రకారం బకాయిలపై వడ్డీ రూపేణా రూ.2,200 కోట్లను డిస్కంలు చెల్లించాలి. తమ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నిర్దేశిత వ్యవధిలో బకాయిలను చెల్లించడం సాధ్యం కాదని, ఏడాది వ్యవధి ఇవ్వాలంటూ డిస్కంలు అఫిడవిట్ దాఖలు చేశాయి. బకాయిల మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం భారమవుతోందని సుప్రీంకోర్టునూ ఆశ్రయించాయి.