సర్వత్రా ఆసక్తి రేపుతున్న దుబ్బాక ఉపఎన్నిక ఫలితం ఇవాళ మధ్యాహ్నం వరకు తేలిపోనుంది. ఈ నెల 3న జరిగిన ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. సిద్దిపేటలోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలోని డీ బ్లాక్‌లో లెక్కింపు చేపట్టనున్నారు. 850 మంది సిబ్బందికి.. శిక్షణ పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలుపెట్టి.. 14 టేబుళ్లపై 23 రౌండ్లలో పూర్తి చేయనున్నారు. మొదట అరగంటలో పోస్టల్ బ్యాలెట్లు పూర్తి చేసి.. అనంతరం ఈవీఎంలలో పోలైన ఓట్లు గణిస్తారు.
పొరపాట్లకు తావివ్వకుండా..
ఓట్ల లెక్కింపులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కరోనా నిబంధనల మేరకు సిబ్బంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి టేబుల్‌కు ఒక మైక్రో అబ్జర్వర్‌ను నియమించడంతో పాటు.. ప్రక్రియ మొత్తం వీడియో చిత్రీకరణ చేయనున్నారు. రౌండ్ లెక్కింపు పూర్తికాగానే ఎన్నికల సంఘం వెబ్ సైట్లో వివరాలు నమోదు చేయనున్నారు.