తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌లోని ఓ పార్శిల్ కార్యాలయం నుంచి రూ.3కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో పార్శిల్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీకి పంపుతున్న 8కిలోల పార్శిల్‌ను అనుమానంతో తనిఖీ చేశారు. అందులో ఒక కిలో మెథాంఫేటమైన్ మత్తు పదార్థాలు, మిగిలిన 7కిలోలు మురుకులు, మ్యాగీ, ఇతర ఆహారపదార్థాలు ఉన్నట్లు గుర్తించారు.
మెథాంఫేటమైన్ మత్తుపదార్థాలు కేంద్ర నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని అధికారులు తెలిపారు. గుండె పనితీరు, మెదడు, రక్తపోటు, రక్తనాళాలకు హానీ కలిగిస్తాయని అన్నారు. ఈ మాదక ద్రవ్యాల విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.3కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. పార్శిల్ చేసిన వారి వివరాలను పరిశీలించగా అవన్నీ నకిలీగా తేలినట్లు డీఆర్‌ఐ అదనపు డైరెక్టర్ జనరల్ ప్రకటించారు. పార్శిల్ చేసిన నిందితుల కోసం పరిసర ప్రాంతంలోని సీసీ టీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.