ఖమ్మంలో ఒక వ్యాపారికి కరోనా సోకింది. లక్షణాలు తీవ్రమవ్వడంతో హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్చారు. ‘రెమిడెసివిర్ 100 ఎంజీ ఇంజక్షన్-2’ ‘టోసిలిజుమాబ్ 400 ఎంజీ ఐవీ ఇంజక్షన్-1’.. అవసరమని చెప్పి వైద్యుడు చీటీ రాసి ఇచ్చారు. రాజధానిలో పేరున్న ఏ ఔషధ దుకాణానికి వెళ్లినా ఆ మందులు లేవన్న సమాధానమే వచ్చింది. ఒక హోల్‌సేల్ దుకాణంలో గరిష్ఠ చిల్లర ధర(ఎంఆర్‌పీ) కంటే ఐదింతలు అధికంగా చెల్లించి కొన్నారు.
ఒకవైపు ప్రాణం నిలబెట్టుకోవాలనే ఆరాటం.. మరోపక్క ఆ బలహీన క్షణాన్నే సొమ్ము చేసుకోవాలనే స్వార్థం. వీటి మధ్య కరోనా రోగులు మానసికంగా నలిగిపోతున్నారు. ఆర్థికంగా చితికిపోతున్నారు. అత్యవసర చికిత్సల్లో అందించాల్సిన ప్రాణాధార ఔషధాల పేరిట యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. తెలంగాణలో కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులే ఇందులో కీలకంగా వ్యవహరిస్తుండగా.. మరికొందరు ఔషధ టోకు వ్యాపారులూ అడ్డగోలు వసూళ్లలో భాగస్వాములవుతున్నారు. రూ.5600కు అమ్మాల్సిన ఇంజక్షన్‌ను రూ.30 వేలకు.. రూ.36 వేలకు అమ్మాల్సిన ఔషధాన్ని ఏకంగా రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకూ కూడా విక్రయిస్తున్నారు. వీటికి బిల్లులు కూడా ఇవ్వడం లేదు.
వెంటిలేటర్ పెట్టాల్సిన సమయం తగ్గుతుంది
కొవిడ్ రోజురోజుకూ విజృంభిస్తున్న తరుణంలో మధ్యతరగతి మరింత చితికిపోకుండా ఉండాలంటే.. అత్యవసర ఔషధాల పేరిట కొనసాగుతున్న ఈ అడ్డగోలు దోపిడీని నియంత్రించాల్సిన ఆవశ్యకత ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కరోనా బాధితుల్లో ప్రాణవాయువు అవసరమైన దశలో కొన్ని కీలక ఔషధాలను అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయోగాత్మకంగా వినియోగించడానికి మాత్రమే భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) అనుమతించింది. ఈ ఔషధాలు పూర్తిగా పనిచేస్తాయనడానికి ఆధారాలు లభించలేదు. దీనివల్ల మరణాల శాతం కొంత తగ్గొచ్చు లేదా రోగి ఆసుపత్రిలో ఉండాల్సిన రోజుల సంఖ్య.. రోగికి వెంటిలేటర్ పెట్టాల్సిన సమయం తగ్గే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రధానమైనవి రెండు. 1.రెమిడెసివిర్ 2. టోసిలిజుమాబ్. ఈ ఔషధాలను వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇవ్వాలి. అందులోనూ రోగి అంగీకార పత్రం ఇచ్చినప్పుడే వాడాలి.
రెమిడెసివిర్
ఈ ఇంజక్షన్ 100 ఎంజీలో లభిస్తుంది. తొలిరోజు 100 ఎంజీ చొప్పున రెండు, తర్వాత 4రోజుల పాటు 100 ఎంజీ చొప్పున ఇస్తారు. ప్రధానంగా ఇది వైరస్ ఉత్పత్తిని ఆపుతుంది. కరోనా లక్షణాలు మధ్యస్థ(మోడరేట్), తీవ్ర(సివియర్) దశలో ఉన్నవారికి ఇస్తున్నారు. ఇప్పుడు స్వల్ప లక్షణాలున్న దశలోనూ ఇస్తే ఎలాగుంటుందనే ప్రయోగాలు జరుగుతున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. దీని గరిష్ఠ చిల్లర ధర కంపెనీలను బట్టి రూ.4 వేల నుంచి రూ.5600 వరకూ.. ఆరు డోసులు వినియోగిస్తే.. ఈ ఔషధానికి గరిష్ఠంగా రూ.33,600 కంటే ఎక్కువ ఖర్చు కాకూడదు. కానీ కొందరు ఐదింతలు కూడా వసూలు చేస్తుండడంతో.. రూ.1.68 లక్షలు కూడా ఖర్చు పెట్టాల్సి వస్తోంది.