చెన్నై నగర శివారుల్లో ఓ సాధారణ అపార్ట్‌మెంట్‌లోని చిన్న ఫ్లాటులో అద్దెకు నివాసం.. పూర్తిగా దిగువ మధ్య తరగతి జీవనశైలి.. అలాంటి వ్యక్తి అఫ్గానిస్థాన్ నుంచి రూ.వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాల్ని భారత్‌లోకి దిగుమతి చేసుకోవటం సాధ్యమా? అతనికి అంత స్థాయి ఉందా? లేదా అంతర్జాతీయ మాదకద్రవ్యాల మాఫియా అతన్ని ముందుపెట్టి వెనుక నుంచి ఈ చీకటి దందా నడిపించిందా? ఈ విషయం తెలిసే అతను వారితో చేతులు కలిపాడా? తెలియకుండా ఇరుక్కున్నాడా? గుజరాత్‌లోని ముంద్రా ఓడరేవులో ఇటీవల భారీగా పట్టుబడ్డ హెరాయిన్ కేసుతో సంబంధమున్న ఆంధ్రప్రదేశ్ వాసి మాచవరం సుధాకర్ విషయంలో ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. డబ్బులు వస్తాయన్న ఆశతో పర్యవసానాలు ఆలోచించకుండా సుధాకర్ ఈ ఉచ్చులో ఇరుక్కున్నట్లు దర్యాప్తు సంస్థలు అంచనాకొచ్చాయి. అతని వెనుకున్న వ్యవస్థీకృత ముఠా నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) సుధాకర్ దంపతులను విచారిస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం. మరోపక్క పట్టుబడిన హెరాయిన్ విలువ రూ.21 వేల కోట్లు ఉంటుందని తాజాగా వెల్లడించారు. తొలుత రూ.9వేల కోట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కిలో హెరాయిన్ ధర అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.5-7 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
సరకు ఏంటో తెలియకుండా.. కోడ్ ఇచ్చాడా?
ఓ కంపెనీని ఏర్పాటుచేసి, దాని పేరిట విదేశాలతో ఎగుమతులు, దిగుమతులకు అవసరమైన ఐఈసీ (ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ కోడ్) లైసెన్సు పొంది.. దాన్ని తమకు అందిస్తే కొంత మొత్తంలో కమీషన్ ఇస్తామంటూ మత్తు ముఠా సభ్యులు సుధాకర్‌కు ఎరవేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఆ డబ్బులకు ఆశపడి సుధాకర్ కోడ్ వివరాల్ని స్మగ్లరకు ఇచ్చినట్లు సమాచారం. అయితే, తన కంపెనీ ఐఈసీ లైసెన్సును మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు వాడతారన్న విషయం సుధాకర్‌కు తెలుసా? లేదా? అన్నది డీఆర్‌ఐ అధికారులు కూపీ లాగుతున్నారు. కంపెనీ లైసెన్స్ వివరాలు చెబితే.. కమీషన్ ఇస్తామన్నారంటేనే అదేదో అక్రమ వ్యవహారమై ఉంటుందని సుధాకర్‌కు తెలియదా? అన్నది ప్రధాన ప్రశ్న. తన భార్య దుర్గా పూర్ణ వైశాలి పేరిట విజయవాడలో రిజిస్టర్ అయిన ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరిట ఇటీవల విదేశాల నుంచి పలు దిగుమతులు జరిగిన విషయమూ అతనికి తెలుసని నిర్ధారించారు. ఇప్పటికే వీరిని అదుపులోకి తీసుకున్న డీఆర్‌ఐ అధికారులు సోమవారం భుజ్‌లోని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు పది రోజులు డీఆర్‌ఐ కస్టడీకి అప్పగించింది. దర్యాప్తులో భాగంగా అధికారులు సుధాకర్ దంపతులను విచారిస్తున్నారు. లైసెన్సు వివరాల్ని ఎవరికిచ్చారు? ఆ వ్యక్తులు ఎలా పరిచయమయ్యారు? అంటూ ప్రశ్నించినట్లు సమాచారం. సెప్టెంబర్ 15న డ్రగ్స్ పట్టుబడగా.. అప్పటి నుంచి అహ్మదాబాద్, దిల్లీకి చెందిన కొందరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న డీఆర్‌ఐ.. వారిచ్చిన సమాచారం మేరకు అసలైన కింగ్‌పిన్‌ను పట్టుకొనే పనిలో ఉంది.