కరోనాపై పోరుకు రక్షణరంగ సాంకేతికతతో 2-డీజీ ఔషధం అభివృద్ధి సహా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని డీఆర్డీవో ఛైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి తెలిపారు. 2-డీజీ ఔషధంపై ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ సంయుక్తంగా నిర్వహించిన వెబినార్లో సతీష్ రెడ్డి పాల్గొన్నారు. మధ్యస్త, తీవ్ర లక్షణాలున్న కొవిడ్ రోగులపై ఈ ఔషధం సమర్థవంతంగా పనిచేస్తుందని.. ఆక్సిజన్ వినియోగాన్ని తగ్గిస్తుందని వివరించారు.
కొవిడ్ రోగులపై 2-డీజీ సమర్థవంతంగా పనిచేస్తోంది: డీఆర్డీవో ఛైర్మన్ - telangana varthalu
మధ్యస్త, తీవ్ర లక్షణాలున్న కొవిడ్ రోగులపై 2-డీజీ ఔషధం సమర్థవంతంగా పనిచేస్తుందని డీఆర్డీవో ఛైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి తెలిపారు. కరోనాపై పోరుకు రక్షణరంగ సాంకేతికతతో 2డీజీ ఔషధం అభివృద్ధి, ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పైలట్ రక్షణ కోసం డీఆర్డీవో రూపొందించిన... ఆన్ బోర్డ్ ఆక్సిజన్ జనరేటింగ్ సిస్టంను ఆస్పత్రుల్లో ఆక్సిజన్ తయారీకి వినియోగిస్తున్నామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ఈ వ్యవస్థతో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్న ప్రధాని ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే నెల నాటికి 2-డీజీ ఔషధాన్ని విస్తృతంగా ఉత్పత్తి చేసి దేశంలోని ఆస్పత్రులకు తగినంత పంపిణీ చేస్తామని డాక్టర్ రెడ్డీస్ సీఈవో దీపక్ సప్రా తెలిపారు. ఈ వెబినార్లో ఔషధ తయారీలో పాలు పంచుకున్న శాస్త్రవేత్త డాక్టర్ అనంత్ నారాయణ్ భట్, ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు రమాకాంత్ సహా పలువురు పాల్గొన్నారు.
2--డీజీకి డిమాండ్ పెరిగింది
దేశవ్యాప్తంగా 2-డీజీ ఔషధానికి డిమాండ్ ఏర్పడింది. ఔషధం ఉపయోగించిన రోగులు త్వరగా కోలుకుంటున్నారు. వారికి ఆక్సిజన్ వినియోగం తక్కువగా అవసరమవుతుంది. రక్షణ రంగం ఆన్బోర్డ్ ఆక్సిజన్ జనరేటింగ్ సిస్టం ద్వారా 850 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయటానికి ప్రయత్నిస్తున్నాం . జాలై చివరికల్లా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. -డాక్టర్ సతీష్ రెడ్డి, డీఆర్డీవో ఛైర్మన్