ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైరస్‌ ప్రభావం త్వరలో తారస్థాయికి: డాక్టర్ గగన్‌దీప్‌ కాంగ్‌ - covid second wave facts news

ప్రస్తుతానికి మన వ్యాక్సినేషన్‌ వ్యూహం వైరస్‌ విస్తరణను తగ్గించే దృష్టితో లేదు. ఎక్కువ రిస్క్‌ ఉండే వారికి ఇబ్బంది రాకుండా, మరణాలు లేకుండా చూసేలాగే ఉంది. దేశంలో 30 శాతంమందికి టీకాలు వేసి ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరిగిన తర్వాతే వైరస్‌ విస్తరణపై దాని ప్రభావం ఎలా ఉంటుందో చెప్పగలమని ప్రముఖ వైరాలజిస్టు, వెల్లూరులోని క్రిస్టియన్‌ వైద్య కళాశాల (సీఎంసీ) ప్రొఫెసర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ అభిప్రాయపడ్డారు. కరోనా రెండోదశ ప్రారంభమై మనం ఇప్పటికే రెండోనెల ముగింపులో ఉన్నాం కాబట్టి తారస్థాయికి చేరి తగ్గడానికి ఎంతో సమయం పట్టదని చెప్పారు. తన పరిశోధనలకు 2016లో ఇన్ఫోసిస్‌ ప్రైజ్‌ను దక్కించుకొన్న కాంగ్‌, ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటీకి భారతదేశం నుంచి ఎన్నికైన మొట్టమొదటి భారతీయ మహిళ. దిల్లీలోని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ గులేరియాతో కలిసి ఆమె కరోనాపై పుస్తకం రాశారు. దేశంలో కరోనా తీవ్రత, ప్రస్తుత పరిస్థితిపై అనేక విషయాలను 'ఈటీవీ భారత్'​కి ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించారు.

covid cases in india
corona second wave in india

By

Published : Apr 21, 2021, 8:53 AM IST

నం టీకాలను విస్తృతంగా వాడుతున్నకొద్దీ కొవిడ్‌ కూడా మన రోగనిరోధక వ్యవస్థ కన్నుగప్పి విస్తరించేందుకు కొత్త కొత్త మార్గాలను అన్వేషించే అవకాశం లేకపోలేదు. మనుషులను చంపగలిగే వైరస్‌లు అంత తేలికగా, వేగంగా వృద్ధి చెంది, విస్తరించలేవు కాబట్టి భవిష్యత్తులో కరోనా మరీ అంత తీవ్రమైన వ్యాధిగా పెనుమార్పులు సంతరించుకుంటుందని నేను అనుకోవడం లేదు.- డాక్టర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌

ప్రశ్న: రెండోదశలో కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. మనదేశంలో వైరస్‌ వ్యాప్తిని నిలువరించేది ఎలా? రోజుకు నాలుగు లక్షల పాజిటివ్‌ కేసులు కూడా వస్తాయని అంటున్నారు.. నిజమేనా?

జవాబు: రెండోసారి ఉద్ధృతి చాలా తీవ్రంగా ఉంది. దీనికి కారణం మొదటిసారిలాగా ఇప్పుడు కొవిడ్‌ ప్రవర్తనను బట్టి మనం నడుచుకోవడం లేదు. దీంతో పాటు వైరస్‌లో కొత్త రకాల వల్ల ఎక్కువగా విస్తరిస్తోంది. మనం అందరికీ వెంటనే వ్యాక్సిన్‌ వేయలేం కాబట్టి, ప్రజలు తగిన రక్షణ చర్యలు తీసుకోకుండా ఎవరికీ దగ్గరగా వెళ్లకూడదు. మంచి నాణ్యత గల మాస్కులు వాడటం, దూరం పాటించడం, ఇంట్లో ఉన్నప్పుడు మంచి గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవడం అవసరం. రెండోదశ చాలా తీవ్రమైంది, ప్రమాదకరమైంది. నిజానికి వైరస్‌ సోకినవారిలో కొద్దిశాతంమందే ప్రమాదంలోకి వెళ్తున్నా, ఇది ఎక్కువమందికి సోకుతుండడం వల్ల సంఖ్యాపరంగా ఎక్కువమందే ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్తున్నారు. ఆ సంఖ్యకు తగ్గట్లుగా మన ఆరోగ్య వ్యవస్థ సిద్ధంగా లేదు. మనం ఏదో ఒకటి చేయకపోతే కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రాలు కొన్ని నిషేధాజ్ఞలు విధిస్తున్నాయి. కాబట్టి రోజుకు అంత ఎక్కువ కేసులు రాకపోవచ్చు.

ప్రశ్న: రెండో వేవ్‌లో ఆర్థిక, రాజకీయ అంశాలు శాస్త్రవేత్తలు తీసుకొనే నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయా? వైరస్‌ను నిరోధించడానికి ప్రస్తుతం ప్రభుత్వాలు సరిగానే వ్యవహరిస్తున్నాయంటారా?

జవాబు:కరోనా నియంత్రణకు లాక్‌డౌన్లు విధించాలన్న దశ దాటి ముందుకొచ్చాం. రాష్ట్రాల్లో వైరస్‌ వ్యాప్తికి కారణాలేంటో తెలుసుకోలేమా? మార్కెట్లా, కాలేజీలా, పాఠశాలలా, సినిమా థియేటర్లా, పండుగలా, ఎన్నికల ర్యాలీలా? ఏవి ఎక్కువగా వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నాయో కనిపెట్టాలి. వాటిని సాక్ష్యాలతో సహా ప్రభుత్వాల ముందు పెట్టాలి. లాక్‌డౌన్‌ అనేది గుడ్డిగా విధించే ఆయుధం. సమాజానికి, ఆర్థిక కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే మనం మెరుగైన పద్ధతులను అనుసరించవచ్చు.

ప్రశ్న: గత ఏడాది కాలంగా జరిగిన విస్తృత పరిశోధనల వల్ల భవిష్యత్తులో వైరస్‌ ప్రవర్తన ఎలా ఉంటుందో అంచనా వేయగలమా? అది ఇంకా కఠినంగా తయారవుతుందా?

జవాబు:వైరస్‌ ప్రవర్తన గురించి చాలా తెలుసుకొన్నామనే చెప్పాలి. భవిష్యత్తులో ఇది ఎలా ఉంటుందో కూడా చాలా వరకు అంచనా వేయగల సామర్థ్యం లభించింది. కరోనా వైరస్‌ చాలా సులభంగా విస్తరించడానికి, పదింతలవడానికి సులభమైన మార్గాలను వెతుక్కుంటూ ఉంటుంది. మరింత సాంక్రమిక శక్తి కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. మనం టీకాలను విస్తృతంగా వాడుతున్నకొద్దీ అది కూడా మన రోగనిరోధక వ్యవస్థ కన్నుగప్పి విస్తరించేందుకు కొత్త కొత్త మార్గాలను అన్వేషించే అవకాశం లేకపోలేదు. అయితే అదృష్టవశాత్తూ అది మనలో ప్రవేశించడానికి స్పైక్‌ ప్రొటీనే కీలకం. దానిలో మార్పులు రావడానికి అవకాశాలు తక్కువగానే ఉంటాయి. కాబట్టి ఆ మార్పులేంటో మనం మహా అయితే ఓ రెండేళ్లపాటు చూడొచ్చు. ఈ మార్పుల వల్ల అక్కడక్కడా తీవ్రమైన రకాలు పుట్టుకొచ్చే అవకాశం ఉన్నా, ఇవి వేగంగా విస్తరించే వైరస్‌లలో ఉంటేనే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. కానీ మనుషులను చంపగలిగే వైరస్‌లు అంత తేలికగా, వేగంగా వృద్ధి చెంది, విస్తరించలేవు కాబట్టి భవిష్యత్తులో ఇది మరీ అంత తీవ్రమైన వ్యాధిగా పెనుమార్పులు సంతరించుకుంటుందని నేను అనుకోవడం లేదు.

ప్రశ్న: వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని మనం గణనీయంగా పెంచాం. అయితే చివరకు తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నాం. ఈ పరిస్థితికి కారణం?

జవాబు:దీనికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది దేశంలో వ్యాక్సిన్‌ల ఉత్పత్తి సామర్థ్యం ఎక్కువే కాని ముడిసరకులు అంతర్జాతీయ సంస్థల నుంచి కొనుక్కోవాలి. రెండోది మన వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులు ఎక్కువ అంచనాలు వేసుకున్నా అనేక కారణాల వల్ల అలా జరగలేదు. మూడోది వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులకు కచ్చితమైన మార్కెట్‌ ఏదో తెలిసి ఉండాలి. ఆ స్పష్టత లేకపోయింది. ప్రభుత్వం కూడా అప్పుడు కొంత అప్పుడు కొంత చొప్పున ఆర్డర్లు ఇస్తోంది. అదీ తక్కువ ధరకు. ఇవన్నీ తక్కువ ఉత్పత్తికి, కొరతకు కారణాలు.

ప్రశ్న: ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వాల పాత్ర ఏంటి?

జవాబు:ప్రజారోగ్యంపై రాజీ పడకుండా అత్యవసరమైన పనులు, ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించడం గురించి ప్రభుత్వాలు ఆలోచించాలి. కొన్ని కార్యకలాపాలు ప్రత్యేకించి వినోదం, రాజకీయ ర్యాలీలు, ధార్మిక కార్యక్రమాలు, ఉత్సవాలు మొదలైన వాటికి ఎక్కువమంది ప్రజలు హాజరవుతున్నారు. జనం ఎక్కువగా గుమికూడితే వైరస్‌ వ్యాప్తి సులభంగా జరుగుతుంది. ఇలాంటి వాటి గురించి ప్రభుత్వాలు ఆలోచించి చర్యలు తీసుకోవాలి.

ప్రశ్న:ఇప్పటివరకు మన వ్యాక్సినేషన్‌ పది శాతం లోపే. దీనిని పెంచడానికి ఏం చేయాలి? వైరస్‌ను నియంత్రించడంలో వ్యాక్సిన్‌ ప్రభావం ఎంత?

జవాబు:వ్యాక్సినేషన్‌కు ఉన్న విలువను, ప్రాధాన్యతను, దీనివల్ల కలిగే తేడాను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మనం ఇజ్రాయెల్‌ను ఉదాహరణగా చూడాలి. ఒకసారి ఎక్కువమంది ప్రజలకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయితే, కరోనా నియంత్రణకు మనం పెట్టుకొన్న అనేక ఆంక్షలను ఎత్తేయవచ్చు.

ఇవీచూడండి:రామోజీ ఫిల్మ్‌సిటీలో పర్యాటకం తాత్కాలికంగా నిలిపివేత

ABOUT THE AUTHOR

...view details