ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తీవ్ర లక్షణాలు కనిపిస్తుంటే.. ఆలస్యం చేయొద్దు!

కరోనా కల్లోల పరిస్థితుల్లో అన్నీ సందేహాలే! కొవిడ్‌ లక్షణాలు బయటపడగానే మందులు వాడితే సరిపోతుందా? అసలు ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లాలి? అనేవి చాలామందిని వేధిస్తున్న ప్రశ్నలు! స్వల్ప లక్షణాలే అనుకుని.. ఇంట్లోనే ఉండి మందులు వాడుతున్నా సరైన సమయంలో వైద్యుల పర్యవేక్షణలోకి వెళ్లకపోతే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అప్పటికే వ్యాధి ముదిరిపోతే చికిత్స కొంత క్లిష్టంగా మారిపోతోంది. మరి ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లాలో ఎలా తేల్చుకోవాలి? మన ఒంట్లో జరిగే మార్పుల్ని గుర్తించడం ఎలా? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు?

corona symptoms
కరోనా లక్షణాలు

By

Published : May 22, 2021, 7:23 AM IST

Updated : May 22, 2021, 9:35 AM IST

కొవిడ్‌ చికిత్సలో లక్షణాలు కనిపించిన తొలి 5-8 రోజులు అత్యంత కీలకమని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. మందులు వాడుతున్నా కూడా తీవ్రమైన జ్వరం వస్తున్నా లేక భరించలేని ఒళ్లునొప్పులు వేధిస్తున్నా.. గతంలో ఎన్నడూ లేనంత నిస్సత్తువ ఆవహిస్తున్నా.. ఒక్కరోజు కూడా జాప్యం చేయొద్దని సూచిస్తున్నారు. ఒకవేళ జ్వరం 101-102 డిగ్రీలు దాటుతుంటే 5 రోజుల వరకూ కూడా ఆగకూడదని నిపుణులు చెబుతున్నారు. తీవ్ర జ్వరం వరసగా 3 రోజులు వచ్చినా వెంటనే ఆసుపత్రిలో చేరాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఎన్నిరోజులు ఆలస్యం చేస్తే.. ఊపిరితిత్తులు అంతగా దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. పైగా ఎక్కువరోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందని, వీరికి చికిత్స అందించడం కూడా కష్టంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

30 శాతం మంది 30-50 ఏళ్ల లోపు వారే

* కొవిడ్‌ తొలిదశతో పోల్చితే.. రెండోదశలో వైరస్‌ ఎక్కువ ప్రభావం చూపుతోంది. అందుకే ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరిగిందని, ఎక్కువ రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. కొందరు 10 రోజులు ఉండాల్సి వస్తే.. మరికొందరు 3-4 వారాలు కూడా చికిత్స పొందాల్సి వస్తోంది. చికిత్సకు ఎంత ఆలస్యంగా ఆసుపత్రిలో చేరుతారో.. కోలుకోడానికి కూడా అంత సమయం పడుతుందని స్పష్టం చేస్తున్నారు.
* రెండోదశలో మహిళల్లో కంటే పురుషుల్లో కొంత తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.
* వైరస్‌ ప్రభావం 30-50 ఏళ్ల మధ్యవయస్కుల్లో అధికంగా కనిపిస్తోంది. ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో దాదాపు 30 శాతంమంది ఈ వయసు వారే ఉంటున్నారు. లక్షణాలు వేధిస్తున్నా తమకేమీ కాదనే ధీమాతో ఇంట్లోనే చికిత్స పొందడం వల్ల ఈ వయస్కులు వ్యాధి ముదిరిన దశలో ఆసుపత్రికి చేరుతున్నారని నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల ఆర్థికంగా కూడా బాగా నష్టపోతున్నారు. కొన్ని సందర్భాల్లో రూ.లక్షలు వెచ్చించినా మనిషి దక్కని దుర్భర పరిస్థితులు ఎదురవుతున్నాయి.

ఇలాగైతే ఆసుపత్రిలో చేరాల్సిందే

1. జ్వరం తగ్గకున్నా..
* లక్షణాలు కనిపించిన తొలిరోజు నుంచి మందులు వాడుతున్నా జ్వరం 101 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతున్నప్పుడు.
* తీవ్రమైన ఒళ్లునొప్పులు వేధిస్తున్నప్పుడు.
* మునుపెన్నడూ లేని రీతిలో శరీరం నిస్సత్తువకు గురైనప్పుడు
* 5 రోజులు గడుస్తున్నా ఈ లక్షణాలు తగ్గుముఖం పట్టనప్పుడు వెంటనే ఆసుపత్రిలో చేరాలి. కొన్ని సందర్భాల్లో జ్వరం వీడకుండా 101 డిగ్రీలు దాటుతుంటే 5 రోజుల వరకూ వేచిచూడకుండా 3 రోజుల్లోనే చేర్పించాలి. వీరిలో రక్తంలో ఆక్సిజన్‌ శాతం 94 కంటే ఎక్కువగా ఉన్నా సరే ఆసుపత్రిలో చేరాల్సిందే.
2. ఆక్సిజన్‌ తగ్గుతున్నా..
* ఇవి కాకుండా రక్తంలో ఆక్సిజన్‌ శాతం 92 కంటే తగ్గినప్పుడూ వెంటనే చేరిపోవాలి.
* రక్తంలో ప్రాణవాయువును కేవలం ఒకేసారి పరీక్షించి.. తగ్గితే ఇక తగ్గిపోయిందేమో అని కంగారు పడొద్దు.
* ఒక 5-6 గంటల వ్యవధిలో ఐదు వేళ్లకూ వేర్వేరు సమయాల్లో పల్స్‌ ఆక్సిమీటర్‌తో పరీక్షించాలి. కనీసం 2-3 నిమిషాలు ఉంచాలి.
* ఏ సమయంలో ఏ వేలికి పెట్టినా 92 కంటే రక్తంలో ఆక్సిజన్‌ శాతం తగ్గుతుందని గుర్తిస్తే ఆసుపత్రిలో చేరాలి.
3. రక్త పరీక్షల్లో తేడాఉన్నా..
* 3-4 రోజులు గడిచినా జ్వరం తగ్గనప్పుడు.. ప్రధానంగా ఫెర్రిటిన్‌, సీఆర్‌పీ, ఎల్‌డీహెచ్‌.. ఈ మూడు రక్త పరీక్షలు చేయించాలి. వీటి ఫలితాల్లో సాధారణంగా ఉండాల్సిన విలువల కంటే.. సీఆర్‌పీ పదింతలు అధికంగా ఉన్నా.. ఫెర్రిటిన్‌, ఎల్‌డీహెచ్‌ రెట్టింపు ఉన్నా ఆసుపత్రిలో చేరాలి. ఎందుకంటే బయటకు తీవ్రమైన లక్షణాలు కనిపిస్తున్నాయంటే.. లోపల ఏదో తేడా జరుగుతోందనే అనుమానించాలి.
* ఇటువంటి వారిలో తొలి 5-6 రోజుల్లో రక్తంలో ఆక్సిజన్‌ శాతం బాగున్నా.. 7-8 రోజుల్లో ప్రాణవాయు శాతం ఉన్నట్టుండి పడిపోయే అవకాశాలున్నాయి.
* ఈ తరహాలో కనుక ఆసుపత్రిలో చేరితే.. 5-7 రోజుల్లోనే ఆరోగ్యవంతులు కావడానికి అవకాశాలెక్కువని నిపుణులు చెబుతున్నారు.

  • 8-13 రోజుల్లోనే దెబ్బతింటున్న శ్వాసకోశాలు

కొవిడ్‌ చికిత్సలో భాగంగా ఓ ముఖ్యమైన విషయాన్ని గుర్తించాం. మొదటిదశలో 7 రోజుల తర్వాత కనిపించే తీవ్రత.. ఇప్పుడు 5 రోజులకే కనిపిస్తోంది. అంటే ప్రభావ తీవ్రత తొలి వారంలో 6-7 రోజుల్లోనే పెరుగుతోంది. దీన్ని గుర్తుంచుకోవాలి. ఈరోజు ఎలా ఉందనే దానితో పాటు.. వచ్చే 2, 3 రోజుల్లో ఏం జరిగే అవకాశాలున్నాయనేది అంచనా వేయడం చాలా ముఖ్యం.
ఇన్‌ఫెక్షన్‌ సోకిన తర్వాత లక్షణాలు తీవ్రంగా ఉండి, తొలి 5-8 రోజుల్లోపు గనుక ఆసుపత్రిలో చేరకపోతే.. వ్యాధి ముదిరిపోతోంది. మొదటి వారంలో లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. ఆ లక్షణాల వల్ల కలిగే దుష్ప్రభావం రెండోవారంలో బయటపడుతోంది.
80-90 శాతంమందిలో 8-13 రోజుల్లోపు శ్వాసకోశాలు ఎక్కువగా దెబ్బతింటున్నాయి. ఆలస్యమైతే రెమ్‌డెసివిర్‌ ఔషధం వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇది యాంటీ వైరల్‌ ఇంజక్షన్‌. లక్షణాలు కనిపించిన 10 రోజుల్లోపే వైరస్‌ శరీరంలో విజృంభిస్తోంది. ఆ దశలో అడ్డుకట్ట వేయడానికి ఈ ఇంజక్షన్‌ను వినియోగిస్తారు.. ఆ దశ దాటిన తర్వాత ఈ ఇంజక్షన్‌ కూడా పనిచేయకపోవచ్చు. ఈ దశలో స్టెరాయిడ్‌ చికిత్స అవసరమవుతుంది.
ఊపిరితిత్తుల్లో ముఖ్యమైన మార్పులన్నీ 7-12 రోజుల మధ్యలోనే జరుగుతాయి. అందుకే లక్షణాలు కనిపించిన తొలి 5 రోజులకు ముందు సీటీ స్కాన్‌ కూడా చేయించొద్దు. 6 రోజుల తరువాత సీటీ స్కాన్‌ చేయిస్తే మంచిది.
చాలామంది అవగాహన లేక ఆలస్యంగా ఆసుపత్రుల్లో చేరుతున్నారు. అంటే 9-12 రోజుల తర్వాత ఆసుపత్రిలో చేరితే.. అప్పటికే ఊపిరితిత్తుల్లో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీంతో ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తోంది. ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వెళ్తున్నవారూ ఉంటున్నారు. అదే తీవ్ర లక్షణాలు కనిపించిన తొలి వారంలోనే ఆసుపత్రిలో చేరి చికిత్స పొందితే.. కచ్చితంగా ఆరోగ్యవంతులుగా తిరిగి ఇంటికి వెళ్తున్నారు.

-డాక్టర్‌ వి.జగదీశ్‌కుమార్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌, ఏఐజీ

ఇదీ చూడండి:

ఆనందయ్య మందు కోసం పోటెత్తిన జనం

Last Updated : May 22, 2021, 9:35 AM IST

ABOUT THE AUTHOR

...view details