Corona Precautions : వేసవి సెలవులు వస్తే.. సొంతూళ్లకు, పర్యాటక ప్రాంతాలకు, చల్లటి ప్రదేశాలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటారు. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు కరోనా ముప్పు పూర్తి వీడిపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ఈ వేరియంట్ అంత ప్రమాదకరంగా లేకపోయినా.. కొత్త వేరియంట్ ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. రెండోదశలో డెల్టా వేరియంట్ ఎంత బీభత్సం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఊళ్లు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే దిల్లీలో కేసుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు ప్రతి ఆరు నెలలకు ఒక కొత్త వేరియంట్ వెలుగులోకి వస్తోంది. మే, జూన్‌లో మళ్లీ కేసులు పెరిగే ప్రమాదముందని నిపుణుల అంచనా. వేరియంట్‌ను బట్టి తీవ్రత ఎంతనేది తెలుస్తుంది.
కరోనా పోలేదు.. వేరియంట్‌ను బట్టి తీవ్రత : డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ ఆసుపత్రి
- కరోనా లేదని ఎలాంటి జాగ్రత్తలు పాటించకపోవడం సరికాదు. ఏ వేరియంట్ ప్రభావమెలా ఉంటుందో అంచనా వేయలేం. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులే నమోదవుతున్నాయి. ఇందులో సబ్‌టైప్స్ వల్ల ప్రమాదం లేదు. కొత్త వేరియంట్ బట్టి ప్రమాద తీవ్రత ఉంటుంది.
- ఒమిక్రాన్ ఒకటి, రెండో దశల కంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందింది. పెద్దగా లక్షణాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాం. ప్రతి వేరియంట్ ఇలానే ఉంటుందని అంచనా వేయలేం. మ్యూటేషన్ల ప్రక్రియ ఆగదు. కొత్త వేరియంట్లు వస్తూనే ఉంటాయి. నాలుగైదేళ్లు ఇదే పరిస్థితి తప్పదు.
- అనవసర భయం కూడా వద్దు. జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం మనవద్ద కేసులు లేవు. దిల్లీలో పెరుగుతున్నాయి. అక్కడ కూడా పెద్దగా ఇబ్బంది లేదు.
- ఒక వేరియంట్‌కు మరో వేరియంట్‌కు ఆర్నెల్లు తేడా ఉంటోంది. దాని ప్రకారం మే, జూన్‌లో నాలుగో దశ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా. ఒకటి, రెండు, మూడు వేరియంట్లు వేసవిలోనే విరుచుకుపడిన సంగతి గుర్తించాలి. మళ్లీ చలికాలం నాటికి తగ్గుముఖం పడుతున్నాయి.
- ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా కరోనా మాత్రమే కాదు. వడదెబ్బ ముప్పు ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12-4 గంటల మధ్య బయటకు వెళ్లక పోవడం మంచిది. ఈ కాలంలో ఆహారం, నీళ్ల కలుషితం ఎక్కువగా జరుగుతుంటాయి. ఆహారం తొందరగా పాడవుతుంది. స్వచ్ఛమైన నీరు.. తాజా ఆహారం తీసుకోవాలి. పిల్లలు, వృద్ధులు, గర్భిణుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలి.
ఇవి పాటిస్తున్నారా...?
* పర్యాటక ప్రాంతాలకు, సొంతూళ్లకు వెళ్లేవారు తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలి. కుటుంబంలో 15-18 ఏళ్ల టీనేజర్లు, 12 ఏళ్లు దాటిన పిల్లలుంటే వారికీ ఇప్పించాలి. కరోనా తగ్గుముఖం పట్టిందని చాలామంది టీకా తీసుకోవడం లేదు. ఇతర ప్రాంతాలకు వెళ్లే వాళ్లు కచ్చితంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
* జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు లాంటివి ఉంటే కరోనా పరీక్ష చేసుకోవాలి. నెగెటివ్ వస్తేనే ఊరెళ్లాలి. కిక్కిరిసిన రైళ్లు, బస్సుల్లో ప్రయాణం శ్రేయస్కరం కాదు.