తెలంగాణలో డిస్కంల పరిస్థితి ఎలా ఉంది?
అవి నష్టాల్లో ఉన్న మాట వాస్తవమే. ప్రస్తుతానికి హరియాణా, గుజరాత్ రాష్ట్రాల్లో మినహా దేశంలో అన్ని డిస్కంలది అదే పరిస్థితి. మన దగ్గర సరఫరా, పంపిణీ(టీ అండ్ డీ) నష్టాలు తక్కువగానే ఉన్నాయి. రూ.30 వేల కోట్లతో ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను ఆధునికీకరించాం. దీనివల్ల విద్యుత్ వృథా తగ్గింది.
విద్యుత్ సంస్కరణలపై రాష్ట్ర అభ్యంతరాలు..?
రాష్ట్ర సూచనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. బిల్లులో కొన్ని సవరణలు తెచ్చింది. నేరుగా నగదు బదిలీ (డైరక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్- డీబీటీ) నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. వ్యవసాయమీటర్లను పెట్టాలన్న యోచననూ విరమించుకుంది.
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌పై ఏ విధంగా సమాయత్తమవుతున్నారు?
ఈ వేసవిలో వినియోగం 14 వేల మెగావాట్ల వరకూ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన విద్యుత్తును అందిస్తాం. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి రివర్సబుల్ యూనిట్లను వినియోగిస్తున్నాం.
తాజా ప్రతిపాదనల్లో ముఖ్యాంశాలేమిటి?
రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటా ప్రీపెయిడ్ మీటర్లు పెట్టబోతున్నాం. వీటి ఏర్పాటుకు ఆర్థిక సాయం కోసం కేంద్రానికి లేఖ రాయదలిచాం.