Capital Decentralization in AP : నూతన జిల్లాల్లో ఒకే ప్రాంగణంలో అన్ని శాఖల కార్యాలయాలనూ నిర్మిస్తామంటున్న సర్కారు... అమరావతి రాజధానిలో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను మాత్రం మూడు రాజధానుల పేరుతో తరలించే ప్రయత్నం చేస్తోంది. రాయలసీమ నుంచి 900 కిలోమీటర్ల పైన దూరం ఉండే విశాఖపట్నంలో సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలను, ఉత్తరాంధ్ర నుంచి 925 కిలోమీటర్ల దూరంలో ఉండే కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తామంటోంది. . జిల్లా కేంద్రాల విషయంలో ఒక పద్ధతి.. రాష్ట్ర రాజధాని దగ్గరకొచ్చేసరికి మరో విధానమంటోంది. దీని వెనక ఆలోచన ఏమిటి? ప్రభుత్వమే చెబుతున్నట్లు మంచి ఆకృతులతో పదికాలాలపాటు గుర్తుండే రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం లేదా? సగటున ఒక్కో జిల్లాలో ఉండే 20 లక్షల జనాభాకు జిల్లా కేంద్రాన్ని అందుబాటులో ఉంచేలా నిర్ణయం తీసుకున్నామంటున్న సర్కారు.. అయిదు కోట్ల ప్రజలకు అనుకూల ప్రాంతమైన అమరావతిలోని రాజధానిని తరలించేందుకు ఎందుకు ప్రయత్నిస్తోంది? రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలకు రాష్ట్ర రాజధాని దగ్గరగా ఉండాల్సిన అవసరం లేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
జిల్లా ప్రజలందరికీ.. అక్కడి జిల్లా కేంద్రాలు అందుబాటులో ఉండాలనే ప్రాథమిక సూత్రాన్ని కొత్త జిల్లాల ఏర్పాటులో పరిగణనలోకి తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. అందుకే తమ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న లోక్‌సభ నియోజకవర్గానికో జిల్లా అనే హామీని సైతం పక్కన పెట్టింది. జిల్లా కేంద్రం అన్ని మండలాల ప్రజలకు దగ్గరగా ఉండటం ఎంత అవసరమో.. రాష్ట్ర రాజధాని కూడా అన్ని జిల్లాలకు సమాన దూరంలో ఉండాలనే లాజిక్‌ను ప్రభుత్వం విస్మరించింది. అమరావతిపై మొండిగా వ్యవహరిస్తోంది. మూడు రాజధానుల వ్యవహారం.. వైకాపా ఎన్నికల ప్రణాళికలోనూ లేదు. అయినా పాలనా వికేంద్రీకరణ అనే ఒక్క మాటతో.. రాష్ట్రానికి నడిబొడ్డున ఉండే అమరావతి అభివృద్ధిని కావాలనే పట్టించుకోవడం లేదు.. రాయలసీమ నుంచి విశాఖపట్నానికి, ఉత్తరాంధ్ర నుంచి కర్నూలుకు వెళ్లాలంటే దూరాభారమని తెలిసినా.. వికేంద్రీకరణ పేరుతో మూడు ముక్కలాట ఆడుతోంది.
నరసాపురం మూలగా ఉండటంతో మధ్యలో ఉండే భీమవరాన్ని జిల్లా కేంద్రం చేశామని ప్రభుత్వం చెబుతోంది. భీమవరంతో పోలిస్తే.. నరసాపురానికి 37 కిలోమీటర్ల దూరం పెరుగుతుందంటోంది. కదిరి, ధర్మవరం, పెనుకొండ, హిందూపురం ప్రాంత ప్రజలకు దగ్గరగా ఉంటుందనే పుట్టపర్తిని జిల్లా కేంద్రం చేసినట్లు చెబుతోంది. కదిరి-పుట్టపర్తి మధ్య దూరం 69 కిలోమీటర్లు. ధర్మవరం ప్రాంత ప్రజలు హిందూపురం రావాలంటే 79 కిలోమీటర్లు ప్రయాణించాలి. అదే పుట్టపర్తికి అయితే 39 కిలోమీటర్లు ప్రయాణించి జిల్లా కేంద్రాన్ని చేరుకోవచ్చనేది ప్రభుత్వ వాదన. రాజంపేట లోక్‌సభ నియోజకవర్గానికి కేంద్రంగా రాయచోటిని ఎంపిక చేయడం సబబే అని సమర్థించుకుంటోంది. మదనపల్లి ప్రాంత ప్రజలు రాజంపేట వెళ్లాలంటే 135 కిలోమీటర్లు ప్రయాణించాలి. అందుకే మధ్యలో ఉండే రాయచోటిని జిల్లా కేంద్రంగా నిర్ణయించామంటోంది.. ఒక జిల్లా ఏర్పాటు విషయంలో దూరాభారాన్ని లెక్కలోకి తీసుకున్నామంటున్న రాష్ట్ర ప్రభుత్వం... రాయలసీమలోని చిత్తూరు నుంచి విశాఖపట్నానికి 825 కిలోమీటర్ల దూరం ఉందనే సంగతిని విస్మరించింది. 480 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న అమరావతి అయితే దగ్గరగా ఉంటుందని తెలిసీ.. కావాలనే విశాఖకు నడిపించే ప్రయత్నం చేస్తోంది. రెండు మూడు చోట్ల బస్సులు, రైళ్లు మారాలి. అదే అమరావతిలో ఉన్న ప్రస్తుత హైకోర్టుకు దూరం 590 కిలోమీటర్లే. కర్నూలుతో పోలిస్తే 335 కిలోమీటర్లు తక్కువే. అయినా ప్రభుత్వం ఎందుకు ఉత్తరాంధ్ర ప్రజల్ని కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందన్న ప్రశ్న వినిపిస్తోంది.
రాజంపేట, మదనపల్లిలో ప్రజలు తమకూ జిల్లా కేంద్రం కావాలని ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. నిజంగా పాలనా వికేంద్రీకరణే ప్రభుత్వ విధానమైతే 3ప్రాంతాల అభివృద్ధి కోసం.. ఒక చోట కలెక్టరేట్, మరో చోట ఎస్పీ కార్యాలయం, ఇంకో చోట జిల్లా కోర్టులు, ఇతర కార్యాలయాల్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదు అనే ప్రశ్న వినిపిస్తోంది. జిల్లా కేంద్రానికి దూరం పెరుగుతుందనే కారణంతోనే ఒక నియోజకవర్గం ఒక జిల్లాలోనే ఉంచాలనే నిబంధనను 12 చోట్ల పక్కన పెట్టామని ప్రభుత్వం పేర్కొంటోంది. ఒక జిల్లాలో సగటున 25 మండలాలు ఉంటాయి. వారందరికీ జిల్లా కేంద్రం అందుబాటులో ఉంచేలా చూశామంటున్న ప్రభుత్వానికి.. రాయలసీమ, కోస్తాలోని వందలాది మండలాల ప్రజలు విశాఖకు చేరుకోవడం దూరాభారమనే సంగతి పట్టించుకోవడం లేదు. ఉత్తరాంధ్రనుంచి కర్నూలుకు చేరుకోవడం ఖర్చు, సమయాభావంతో కూడుకున్నదని గుర్తెరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
వికేంద్రీకరణ రాజధానికేనా.. జిల్లాలకు వర్తించదా? ఇదీ చదవండి:ఏపీ కేబినేట్ సమావేశం.. ఈనెల 7వ తేదీ మధ్యాహ్నానికి వాయిదా