Doctors Cheating: చదివింది ఎంబీబీఎస్ అయినా.. పేరు పక్కన ఎండీ అని పెట్టుకొని స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ వైద్యులుగా చలామణీ అవుతున్నారు కొందరు వైద్యులు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఇలాంటి వైద్యుడి వ్యవహారం బట్టబయలైంది. ఎంబీబీఎస్ చదివినా.. తన పేరు పక్కన ఎండీ జనరల్ మెడిసిన్, కార్డియాలజీ అని పెట్టుకున్నాడు. ఈ విషయంపై తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి(టీఎస్‌ఎంసీ)కి ఫిర్యాదు అందింది. వెంటనే స్పందించిన టీఎస్‌ఎంసీ- ఆ వైద్యుడి నుంచి వివరణ కోరడమే కాకుండా సంబంధిత జిల్లా వైద్యాధికారికి ఆదేశాలిచ్చి ఆ క్లినిక్‌ను మూసివేయించింది. తప్పుడు అర్హతలతో ప్రాక్టీసు చేస్తున్నారనే ఆరోపణలతో స్థానిక పోలీసులకు ఫిర్యాదూ చేసింది.
‘ఎండీ’ పట్టాతో మోసాలు..
కొందరు వైద్యులు తమకు లేని స్పెషాలిటీ విద్యార్హతను వాడుకునేందుకు విదేశీ వైద్యవిద్య పట్టాలను వినియోగించుకుంటున్నారు. చైనా సహా కొన్ని దేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసినవారికి ‘ఎండీ’ పట్టా ఇస్తున్నారు. అక్కడి ఎండీ పట్టా.. మన దగ్గరి ఎంబీబీఎస్ పట్టాతో సమానం. విదేశాల్లో వైద్యవిద్య పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత.. భారత్‌లో అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైనవారు రాష్ట్ర వైద్య మండలిలో తమ సమాచారాన్ని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఈ సందర్భంగా ‘ఎండీ ఇన్ చైనా ఈక్వలెంట్ టు ఎంబీబీఎస్’ అని ధ్రువపత్రంలో స్పష్టంగా పేర్కొంటున్నారు. అయినా కొందరు వైద్యులు పేరు పక్కన ఎండీ అని మాత్రమే రాసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. మరికొందరు ‘ఎండీ’ అని పెద్ద అక్షరాల్లో రాసి.. దాని కింద ‘ఈక్వలెంట్ టు ఎంబీబీఎస్’ అని కంటికి కనిపించనంత చిన్న అక్షరాల్లో రాస్తున్నారు. ఇంకొందరు ఎండీ పక్కన జనరల్ మెడిసిన్ అని, పీడియాట్రిక్స్ అని కూడా రాసుకుంటున్నారు. ‘కార్డియాలజీ’, ‘న్యూరాలజీ’ తదితర కోర్సుల్లో ఆర్నెల్ల డిప్లొమా కోర్సులు చేసిన కొందరు.. ఏకంగా కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టులుగా అవతారమెత్తుతున్నారు.
నిజానికి కార్డియాలజీ, న్యూరాలజీలలో మూడేళ్ల సూపర్ స్పెషాలిటీ కోర్సు చదివితే తప్ప సూపర్ స్పెషలిస్ట్‌గా ప్రాక్టీసు చేయడానికి అర్హత లభించదు. అయినా ఆర్నెల్ల డిప్లొమా కోర్సులతోనే సూపర్ స్పెషలిస్టులుగా బోర్డులు పెట్టుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా పెడధోరణులు పెరిగిపోయాయని, పేరున్న నగరాల్లో కాకుండా.. అంతగా ప్రాచుర్యం లేని పురపాలక పట్టణాల్లో ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని వైద్య మండలి వర్గాలు తెలిపాయి.
రోగులపై ఆర్థిక భారం..
బోర్డులపై విద్యార్హతలను చూసి నిజంగానే స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యులనుకొని అనేకమంది రోగులు మోసపోతున్నారు. ఇదే అదనుగా రూ.వేలకు వేలు రుసుంలు, నిర్ధారణ పరీక్షల రూపంలో గుంజుతున్నారు. ఈసీజీ సహా అనేక పరీక్షలు చేయిస్తున్నారు. తమ వల్ల నయం కాకపోతే మరిన్ని పరీక్షలు చేయించాలని లేదా పెద్దాసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. దీంతో రోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. మరోవైపు జబ్బును సకాలంలో, సక్రమంగా గుర్తించకపోతే.. అది ముదిరి ప్రాణాల మీదకూ వచ్చే ప్రమాదమూ లేకపోలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి జిల్లాస్థాయిలో డీఎంహెచ్‌వోలు తరచూ ఇటువంటి క్లినిక్‌లను తనిఖీ చేయాలి. క్షేత్రస్థాయిలో అది జరగడం లేదు. కొన్నిచోట్ల గుర్తించినా.. అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఇది అనైతికం.. నేరం...