‘‘కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన ప్రతి వందమందిలో 84 శాతం మందికి ఎలాంటి లక్షణాలు కనిపించడంలేదు. హాయిగా ఇంట్లో ఉండే ఈ మహమ్మారిని జయిస్తున్నారు. మిగతా వారూ చికిత్సతో బయటపడుతున్నారు’’ అని వైద్యులు వివరిస్తున్నారు. వారు ఇంకా ఏం చెబుతున్నారంటే.. కేవలం కొద్దిమందికి మాత్రమే పరిస్థితి వికటిస్తోంది. అందులో ఒకరిద్దరు మాత్రమే చనిపోతున్నారు. మంగళవారం వరకూ రాష్ట్రంలో 84,544 మందికి కరోనా సోకగా వారిలో 61,294 మంది కోలుకున్నారు. 654 మంది మాత్రమే అంటే కేవలం మొత్తం నమోదైన కరోనా కేసుల్లో మరణాల శాతం రాష్ట్రంలో 0.77 శాతం కాగా, ఈ విషయంలో జాతీయ సగటు (1.99 శాతం) కంటే తక్కువ.
- ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం కేవలం సాధారణ జలుబు వల్ల శ్వాసకోశ సమస్యలు తలెత్తి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఆరున్నర లక్షలమంది చనిపోతున్నారు. జాగ్రత్తగా ఉండకపోతే జలుబు కూడా చంపేస్తుంది.
- అంతెందుకు కేవలం రోడ్డు ప్రమాదాల కారణంగా 2018 సంవత్సరంలో దేశంలో 1,51,417 మంది చనిపోయారు. 4,69,418 మంది వైకల్యం పొందారు. వీటితో పోల్చుకుంటే కరోనా మరణాలు చాలా తక్కువ.
కుటుంబ సభ్యులే కీలకం
- ఎవరైనా కొవిడ్ బారినపడ్డా, దీనికి భయపడుతున్నట్లు కనిపించినా వెంటనే కుటుంబసభ్యులు అప్రమత్తం కావాలి. ధైర్యం చెప్పాలి. సానుకూల అంశాలే ప్రస్తావించాలి. వైద్యులతో మాట్లాడించాలి. సమాజం కూడా వారిని వెలివేసినట్లు చూడకూడదు.
- విదేశాల్లో కరోనా రోగుల కోసం ఆన్‌లైన్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తప్పదనుకుంటే ఆసుపత్రికి తరలించి కౌన్సెలింగ్, చికిత్స చేయిస్తున్నారు. మన దగ్గర కూడా ‘హితం’ పేరుతో ప్రభుత్వం ఒక యాప్ రూపొందించింది. ఇంటి వద్ద ఉండి చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులకు ఈ యాప్ ద్వారా వైద్య నిపుణులు వైద్యపరమైన సలహాలను అందిస్తున్నారు.
సకాలంలో వైద్యం అందితే ముప్పు తగ్గినట్లే
- కొంతమందికి పుట్టుకతోనే అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. వాటి గురించి తెలియకపోవడం, తెలిసినా నిర్లక్ష్యం చేయడం వల్ల వారిపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటోంది.
- సకాలంలో చికిత్స తీసుకోకపోవడం వల్ల మరికొందరు చనిపోతున్నారు. ముఖ్యంగా యువకుల విషయంలో ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సకాలంలో ఆసుపత్రికి వెళ్లినవారిలో వయోవృద్ధులు కూడా కోలుకుంటున్న విషయం తెలిసిందే.
మొదట్లోనే కౌన్సెలింగ్ చేయాలి
కరోనా రోగులకు చికిత్సతోపాటు మొదట్లోనే మానసికంగా కౌన్సెలింగ్ చేయాలి. దాంతో చాలావరకూ సమస్య పరిష్కారం అవుతుంది. కొద్దిమందికి సహజంగా పుట్టుకతోనే ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారు ఇలాంటి విపత్కర సమస్యలు తలెత్తినప్పుడు ఎక్కువగా భయపడుతుంటారు. కుటుంబ సభ్యులు కాస్త ధైర్యం చెప్పడం ద్వారా వారిని మామూలు మనుషులుగా చేయవచ్చు. - శ్రీనివాస్, న్యూరో సైకియాట్రిస్ట్