Omicron effect on Children : ‘‘అమెరికాలో 5 ఏళ్ల చిన్నారులకు కూడా టీకా అందుబాటులో ఉంది. 12 ఏళ్లు పైబడినవారికి ఇటీవలే మూడోడోసుకు అనుమతించారు. అక్కడ ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం పిల్లలపై ఎక్కువగానే ఉంది. అమెరికాలో ప్రస్తుతం మొత్తం పాజిటివ్‌ల్లో 22 శాతం కేసులు పిల్లల్లోనే. ఇది గతంలో 5 శాతంలోపే ఉండేది. భారత్‌లోనూ పిల్లలపై ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగానే కనిపించే అవకాశాలున్నాయి. త్వరలో భారత్‌లోనూ మూడోదశ ఉధ్ధృతికి అవకాశాలు ఎక్కువే. ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తత అవసరం’’ అని భారత సంతతి అమెరికా వైద్యుల సంఘం (ఆపీ) అధ్యక్షురాలు డాక్టర్ అనుపమ గొట్టిముక్కల వెల్లడించారు. వరంగల్‌లో ప్రాథమిక విద్య.. కాకతీయ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్.. ఉస్మానియాలో పీజీ అనస్థీషియా పూర్తి చేసిన అనంతరం.. 22 సంవత్సరాల కిందట అమెరికాకు వెళ్లి.. అక్కడ పీడియాట్రిక్ అనస్థీషియాలో పట్టా పొందారు. ప్రస్తుతం భారత సంతతి అమెరికా వైద్యుల సంఘం అధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. ఈనెల 5 నుంచి 7 వరకూ ఆపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ‘గ్లోబల్ హెల్త్‌కేర్ సమ్మిట్’లో పాల్గొనేందుకు వచ్చిన డాక్టర్ అనుపమతో ‘ఈనాడు-ఈటీవీ భారత్’ ముఖాముఖి.
గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్ నిర్వహణ లక్ష్యాలేమిటి?
భారత్-అమెరికా మధ్య వైద్య విజ్ఞానంలో పరస్పర అవగాహన కోసం ఏటా నిర్వహిస్తుంటాం. పుట్టిన గడ్డకు ఎంతోకొంత సేవ అందించాలనేది ప్రధాన లక్ష్యం. ఇక్కడి వైద్యుల సహకారంతో భారత్‌లో ఉచితంగా క్లినిక్‌లు నిర్వహిస్తుంటాం. అమెరికా నుంచి కూడా స్పెషలిస్టులొచ్చి సేవలందిస్తుంటారు. అవసరమైతే సర్జరీలు కూడా చేస్తుంటారు.
ఆపీ ఆధ్వర్యంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?
గ్రామీణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా భారత్‌లో 75 గ్రామాలను ఆపీ దత్తత తీసుకుంది. పల్లెల్లో ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. ఆర్నెల్లకోసారి ఉచిత రోగ నిర్ధారణ పరీక్షల శిబిరాలు నిర్వహిస్తుంటాం. గ్రామీణ భారతంలో సుమారు 30-40 శాతం మంది మాత్రమే ఆరోగ్యంగా ఉన్నారు. మిగిలినవారు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. అమెరికాలో 40 ఏళ్లు దాటాక ఏటా వైద్య పరీక్షలు తప్పనిసరి. భారత్‌లోనూ ఆ అవగాహన తీసుకురావాలనేది మా ప్రయత్నం.