కరోనా పరీక్షలు, చికిత్సలపై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. కరోనా నియంత్రణకు సిబ్బంది రాత్రీ పగలు కష్ట పడుతున్నారని ఆ రాష్ట్ర సీఎస్ వెల్లడించారు. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చాలా ఉపయోగపడుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దేశ వ్యాప్తంగా యాంటిజెన్ పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో రోజుకు 40వేల ర్యాపిడ్ పరీక్షలు జరిపేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. జీహెచ్‌ఎంసీలో కరోనా తగ్గుముఖం పడుతోందని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలన్నింటికీ ఆక్సిజన్ సదుపాయం కల్పించామని సీఎస్ చెప్పుకొచ్చారు. హితం యాప్‌ను ఇప్పటివరకు 46 వేల మంది వినియోగించారని కోర్టుకు తెలిపారు.
తెలుగులోనూ ఇచ్చాం...
హైకోర్టు సూచనల మేరకు తెలుగులో కూడా బులెటిన్ ఇచ్చామన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులపై నిబంధనల ప్రకారం నోటీసులిచ్చి విచారణ జరుపుతున్నామని వివరించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా కేర్ కేంద్రాల వివరాలు వెల్లడిస్తామన్నారు.