Jagananna Vidya Deevena: జగనన్న విద్యా దీవెన పథకం రుసుములను తల్లుల బ్యాంక్ ఖాతాలో జమచేయడం సరికాదని, కళాశాలల ఖాతాలో వేయాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం స్టే విధించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ప్రశాంతకుమార్ మిశ్ర , జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అది ప్రభుత్వ పథకం అని .. ఏవిధంగా సొమ్ము చెల్లించాలి అనే విషయాన్ని ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించింది. ఈ పథకం కళాశాలల కోసం కాదని పేర్కొంది. విద్యార్థుల తల్లిదండ్రులు సొమ్ము చెల్లించకపోతే .. యాజమాన్యాలకు ఉన్న హక్కుల ప్రకారం రాబట్టుకోవచ్చని తెలిపింది. తల్లుల ఖాతాలో సొమ్ము జమచేయడం వల్ల పిటిషనర్ హక్కులు ఏవిధంగా ఉల్లంఘనకు గురవుతున్నాయో చెప్పాలని ప్రశ్నించింది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం వాటాగా సొమ్ము చెల్లిస్తుంటే .. సింగిల్ జడ్జి వద్ద వ్యాజ్యంలో కేంద్రాన్ని ప్రతివాదిగా చేర్చలేదని ఆక్షేపించింది.
అంతకు ముందు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ .. విద్యా సంస్థల విషయంలో తల్లిదండ్రులను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో తల్లుల ఖాతాలో విద్యాదీవెన సొమ్మును జమచేస్తు జీవో ఇచ్చామన్నారు. సింగిల్ జడ్జి తీర్పు తర్వాత... కొత్తగా మరో జీవో ఇస్తూ.. తల్లులకు సొమ్ము విడుదల చేశాక వారంలో విద్యాసంస్థలకు చెల్లించకపోతే తదుపరి విడత సొమ్ము నేరుగా కళాశాలల యాజమాన్యాలకు జమచేస్తామని పేర్కొన్నామన్నారు. ఆ జీవోను సైతం పిటిషనర్ సవాలు చేశారన్నారు. ఆ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం .. సింగిల్ జడ్జి తీర్పుపై స్టే విధించింది. కౌంటర్ వేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్కు సూచించింది. తదనంతరం తుది విచారణ జరువుతామని పేర్కొంది. జగనన్న విద్యా దీవెన పథకం కింద అర్హులైన విద్యార్థులకు ఇచ్చే బోధన రుసుం చెల్లింపు సొమ్మును తల్లుల బ్యాంక్ ఖాతాలో వేసేందుకు వీలుకల్పిస్తున్న రెండు జీవోలను సవాలు చేస్తూ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సంఘం ' అధ్యక్షుడు ఎస్ఆర్ ప్రసాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
జీవోను రద్దు చేసిన సింగిల్ జడ్జి బెంచ్..
ap high court orders on Jagananna Vidya Deevena:కళాశాలల్లో చదివే అర్హులైన విద్యార్థులకు "జగనన్న విద్యా దీవెన" పథకం కింద చెల్లించే బోధన రుసుములను (ఫీజు రీయింబర్స్‌మెంట్) తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఇక నుంచి విద్యార్థుల తరఫున సొమ్మును కళాశాలల ఖాతాల్లోనే జమ చేయాలని అధికారులను ఆదేశించింది. తల్లుల ఖాతాలో జమ చేసేందుకు వీలు కల్పించే జీవో 28ని రద్దు చేసింది. మరో జీవో 64లోని నిబంధనలను కొట్టేసింది. ఇప్పటికే తల్లుల ఖాతాల్లో జమ చేసిన నగదును కళాశాలలకు చెల్లించేలా చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉండదని పేర్కొంది. ఆయా కళాశాలలు విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవచ్చని తెలిపింది.
ప్రభుత్వం తల్లుల ఖాతాలో జమ చేసిన సొమ్మును.. 40% మంది కళాశాలలకు చెల్లించలేదని గుర్తు చేసింది. ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును తల్లులు చెల్లించకపోతే కళాశాలలు చదువు చెప్పలేవని తెలిపింది. తరగతులు సక్రమంగా నిర్వహిస్తున్నారా.. లేదా? మౌలిక సదుపాయాలు సరిగా ఉన్నాయా.. లేవా? అని పరిశీలించే అవకాశం తల్లిదండ్రులకు కల్పించారని గుర్తు చేసింది. లోపాలుంటే కళాశాలలపై ఫిర్యాదు చేసే హక్కును తల్లిదండ్రులకు ఇచ్చారని వెల్లడించింది.