ప్రాంతం: దివిసీమ.
తేదీ: 1977 నవంబర్ 19.
ప్రజలంతా నిశ్చింతగా నిద్రలోకి జారుకున్నారు..
సుమారు 3 తాడిచెట్ల ఎత్తున ఎగిసిపడిన రాకాసి అలలు.. కరకట్ట కట్టలు దాటి దివిసీమ గ్రామాలపై విరుచుకుపడ్డాయి. ఎప్పటిలాగే తుపాను తీరం దాటుతుందని అంచనా వేసిన ప్రజలను ఊహించని ప్రళయం కబళించింది. సముద్రుడు ఉగ్రరూపం దాల్చి ఊళ్లకు ఊళ్లను కబళించాడు. కనికరం లేకుండా ప్రతాపం చూపిన తుపాను... గ్రామాల ఆనవాళ్లు తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. నిద్రలో ఉన్నవారిని శాశ్వత నిద్రలోకి తీసుకెళ్ళింది. పశుపక్ష్యాదులు అల్లకల్లోలమయ్యాయి. సుమారు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు విల్లులా వంగిపోయాయి.
కొట్టుకుపోయిన ఊళ్లు...
తలచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడిచే ఆనాటి ప్రళయం మిగిల్చిన చేదు జ్ఞాపకాలు.. ఇంకా కళ్ళముందు కదలాడుతూనే ఉన్నాయి. ఉప్పెన ధాటికి పొంగిన అలలు.. సుమారు 83 గ్రామాలను జలసమాధి చేశాయి. ఎక్కడచూసినా గుట్టలుగుట్టలుగా మనుషులు, పశువుల శవాలు, కూలిన ఇళ్లు, చెట్లే..! సుమారు 10 వేలమందిని ఉప్పెన బలిగొన్నట్లు అధికారులు అంచనా వేయగా.. లెక్కకు తెలీకుండా కొట్టుకుపోయిన శవాలు ఎన్నివేలో తేలలేదు..! ఒక్క నాగాయలంక మండలంలోని సోర్లగొందిలోనే 714 మంది కన్నుమూశారు. కోడూరు మండలం పాలకాయతిప్పలో 460 మంది, మూలపాలెంలో 161 మంది చనిపోయారు. సోర్లగొందిలో రామాలయం, పంచాయతీ కార్యాలయాల్లో తలదాచుకుని 200 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఆరోజు మధ్యాహ్నం ఆకాశంలో వచ్చిన మార్పులను గుర్తించి హంసలదీవిలో శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో 400 మంది తలదాచుకున్నారు. ఊళ్లు కొట్టుకుపోయినా, ఈ ఆలయంలోకి చుక్క నీరు కూడా చేరలేదు.