అమరావతి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమగోదావరి, అనంతపురంతోపాటు పలు జిల్లాల్లో ప్రజాప్రతినిధులు నగదు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగానే వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు నగదు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.30 కోట్ల బియ్యం కార్డుల్లో మ్యాపింగ్ చేసిన 1.19 కోట్ల కార్డుదారులకు వాలంటీర్లు వారి ఇంటి వద్దకే వెళ్లి నగదు అందిస్తున్నారు. మ్యాపింగ్ కాని 13 లక్షల 12 వేల 890 బియ్యం కార్డుదారులకు వారి పరిధిలోని గ్రామ సంక్షేమ, విద్య సహాయకులు/వార్డు సంక్షేమ కార్యదర్శి అందించనున్నారు.
ప్రభుత్వ సాయం పక్కదారి పట్టకుండా జియో ట్యాగింగ్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ముందుగా వాలంటీర్ల క్లస్టర్ల పరిధిలోని 50 కుటుంబాల వివరాలను వాలంటీర్ల పేరు మీద మ్యాపింగ్ చేశారు. వారికిచ్చిన ట్యాబ్‌లో జీపీఎస్ వ్యవస్థను పొందుపరిచారు. వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి జీపీఎస్ ఆన్‌చేసి బియ్యంకార్డులోని కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరిని ఇంటి ముందు నిల్చొబెట్టి ఫొటో తీస్తారు. లబ్ధిదారుల వివరాలతోపాటు ఇంటి పరిసర ప్రాంతమూ నమోదవుతుంది. ఇలా జియోట్యాగింగ్ చేసిన తర్వాత నగదు మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేస్తున్నారు.