ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డిజిటలీకరణతో పెరిగిన అవకాశాలు... వృత్తివిద్య శిక్షణతో కొలువు సులువు - తెలంగాణ తాజా వార్తలు

కరోనా నేపథ్యంలో దూరవిద్యకు ప్రాధాన్యం పెరిగింది. డిజిటలీకరణతో దూరవిద్యలో మరిన్ని అవకాశాలు సృష్టించవచ్చని యునెస్కో అభిప్రాయపడింది. టెక్నికల్‌ అండ్‌ ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ అన్న అంశంపై యునెస్కో ప్రధానంగా దృష్టి సారించింది. 2020లో భారతదేశ విద్యావిధానం స్థితిగతులు' పేరుతో తాజాగా నివేదిక విడుదల చేసింది.

distance-education-importance-by-unesco
వృత్తివిద్య శిక్షణతో కొలువు సులువు

By

Published : Dec 26, 2020, 9:45 AM IST

కొవిడ్‌-19 విపత్తు నేపథ్యంలో యువత పునరావాసం పొందటానికి వృత్తివిద్య శిక్షణ దోహదకారి అవుతుంది. దీన్ని విస్తరించి డిజిటలీకరించటం ద్వారా దూరవిద్యా విధానంలో మరిన్ని అవకాశాలు సృష్టించవచ్చని యునెస్కో అభిప్రాయపడింది. ‘2020లో భారతదేశ విద్యావిధానం స్థితిగతులు’ పేరుతో యునెస్కో, న్యూదిల్లీ తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని సృష్టం చేసింది. టెక్నికల్‌ అండ్‌ ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ (టీవీఈటీ) అన్న అంశంపై యునెస్కో ప్రధానంగా దృష్టి సారించింది. 'స్కిల్‌ ఇండియా మిషన్‌’ కింద నైపుణ్యాభివృద్ధిని ప్రాధాన్య అంశంగా భారత ప్రభుత్వం స్వీకరించిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. 2022 నాటికి 11 కోట్ల మంది నిపుణులను తయారు చేయాలనే ఉద్దేశంతో ఏటా కోటి మందికి శిక్షణ అందిస్తున్న విషయాన్ని పేర్కొంది. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు వంటి విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులను ప్రారంభించేందుకు గల అవకాశాలను వివరించింది. 2025 నాటికి 50 శాతం మంది అర్హులకు వృత్తివిద్య శిక్షణ అందించాలని జాతీయ విద్యావిధానం -2020లో పేర్కొన్న నేపథ్యంలో ఈ అంశానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచించింది. 2030 యూఎన్‌ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకూ ఇది ఉపకరిస్తుందని పేర్కొంది.

యునెస్కో ప్రతిపాదనల్లో కొన్ని..

  • వృత్తివిద్య శిక్షణలో అభ్యాసకుల ఆసక్తులను ముందుగా ఎంచుకోవాలి.
  • అధ్యాపకులు, శిక్షకులు, మదింపుదారులకు తగిన వ్యవస్థ (ఎకో సిస్టమ్‌) సిద్ధం చేసుకోవాలి.
  • దీర్ఘకాలం నేర్చుకోవటం, నైపుణ్యాలు పెంచుకోవటంపై దృష్టిపెట్టాలి.
  • స్త్రీలను, విభిన్న సామర్థ్యాలున్న వారిని ప్రత్యేకంగా చూడాలి.
  • ప్రణాళిక, పర్యవేక్షణకు మెరుగైన సాక్ష్యాల ఆధారిత పరిశోధన, విశ్లేషణ చేపట్టాలి.
  • స్థానిక కమ్యూనిటీ విభాగాలకు సహకారం అందించటం వల్ల ఉపాధి కల్పనకు మేలైన అవకాశాలు లభిస్తాయి.
  • అంతర మంత్రిత్వశాఖల మధ్య సమన్వయం పెంచటం ద్వారా ఫలితాలు మెరుగుపడతాయి.

ఉపాధికి మేలైన మార్గం

ఎరిక్‌ ఫాల్ట్‌, డైరెక్టర్‌, యునెస్కో, న్యూదిల్లీ

"నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా టీవీఈటీ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు పొందటం సులువవుతుంది. సాధారణ వర్సిటీల్లో చదివిన వారితో సమానంగా లేదా వారి కంటే ముందుగా అవకాశాలు పొందగలుగుతారు. తగినన్ని నైపుణ్యాలున్న ఉద్యోగుల కొరత ఉందని యాజమాన్యాలు పేర్కొంటున్న నేపథ్యంలో ఈ శిక్షణ ద్వారా ఆ కొరత తీరటమే కాదు.. ఆర్థిక రంగం వేగంగా పుంజుకోవటానికి దోహదం చేస్తుంది. ఇందులో విజేతలను నమూనాలుగా చూపవచ్చు. వడ్రంగం, టైలరింగ్‌ వంటి వృత్తులపై అపోహలను తొలగించాలి."

-ఎరిక్‌ ఫాల్ట్‌, డైరెక్టర్‌, యునెస్కో, న్యూదిల్లీ

ఇదీ చదవండి:

దా'రుణ' యాపుల్లో డ్రాగన్​ వ్యక్తులదే కీలక పాత్ర...

ABOUT THE AUTHOR

...view details