ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇష్టారాజ్యంగా స్టడీ కేంద్రాలు... అక్రమాలకు దగ్గరగా దూరవిద్య..! - distance education in AP

దూరవిద్యా విధానం గాడి తప్పుతోంది. ప్రవేశాల నుంచి పరీక్షల నిర్వహణ వరకూ చాలాచోట్ల నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. విద్యార్థుల డిమాండ్‌ను బట్టి స్టడీ సెంటర్లకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. వర్సిటీలు రాష్ట్రంలో దూరవిద్యకు అనుమతులు తీసుకొని, నచ్చినచోట స్టడీ సెంటర్లకు అనుమతులు ఇస్తున్నారు తప్ప స్పష్టమైన విధానం ఉండట్లేదు.

అక్రమాలకు దగ్గరగా దూరవిద్య
అక్రమాలకు దగ్గరగా దూరవిద్య

By

Published : Apr 9, 2021, 7:04 AM IST

ఉన్నతాశయంతో ప్రారంభించిన దూరవిద్యా విధానం గాడి తప్పుతోంది. ప్రవేశాల నుంచి పరీక్షల నిర్వహణ వరకూ చాలాచోట్ల నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ఉన్నత విద్యావంతుల సంఖ్యను పెంచేందుకు ప్రవేశపెట్టిన ఈ విధానం కొందరి వల్ల పక్కదారి పడుతోంది. నాగార్జున విశ్వవిద్యాలయం గత అక్టోబరు, నవంబరు నెలల్లో నిర్వహించిన పరీక్షల్లో కడప జిల్లా ప్రొద్దుటూరులో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక కేంద్రంలో పరీక్ష రాయాల్సినవారు మరో కేంద్రంలో రాశారని, ప్రాక్టికల్స్‌ ఇతర పరీక్షల్లో భారీగా డబ్బుల వసూళ్లకు పాల్పడినట్లు ఇటీవల కొందరు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. శ్రీకృష్ణ దేవరాయవర్సిటీ (ఎస్‌కేయూ) 2015-16, 16-17లో కేంద్ర దూరవిద్య బ్యూరో (డెబ్‌) అనుమతి లేకుండా ప్రవేశాలు నిర్వహించింది. దీంతో 32వేల మంది భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

సైన్సుకు అదే ఆఖరు..

ప్రొద్దుటూరులో వచ్చిన ఆరోపణలపై నాగార్జున విశ్వవిద్యాలయం కమిటీ ఏర్పాటు చేసింది. తొలుత డిగ్రీ ఫలితాలను నిలిపివేసి, కమిటీ నివేదిక వచ్చిన తర్వాత స్టడీ కేంద్రం అనుమతిని రద్దుచేసింది. అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు చెప్పలేదు. అత్యవసర వినియోగం కోసం 5-10 శాతం అదనపు జవాబుపత్రాల బుక్‌లెట్లు ఇస్తారు. కానీ భారీగా బుక్‌లెట్లను ఇచ్చినట్లు విమర్శలున్నాయి. నాగార్జున వర్సిటీకి న్యాక్‌ స్కోరు 3.08 ఉండటంతో ఈ ఏడాది దూరవిద్య బ్యూరో సైన్సు కోర్సులకు అనుమతి నిలిపివేసింది. న్యాక్‌ స్కోరు 3.5 కంటే ఎక్కువగా ఉన్న వర్సిటీలకే దూరవిద్య సైన్సు కోర్సులకు డెబ్‌ ఆమోదం తెలిపింది.

కేంద్రాల ఏర్పాటు ఎవరి ఇష్టం వారిదే..

దూరవిద్యను రాష్ట్రం మొత్తం నిర్వహించుకోవచ్చనే డెబ్‌ నిబంధనతో వర్సిటీలు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు నిర్వహిస్తున్నారు. నాగార్జున వర్సిటీకి గత అక్టోబరు వరకు ఏపీలో 114 అధ్యయన కేంద్రాలు (స్టడీ సెంటర్లు) ఉండగా.. తెలంగాణలో 117 ఉన్నాయి. విద్యార్థుల డిమాండ్‌ను బట్టి స్టడీ సెంటర్లకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఆంధ్ర వర్సిటీకి శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు 25 అధ్యయన కేంద్రాలున్నాయి. నాలుగైదేళ్ల క్రితం వరకు రాష్ట్రమంతా స్టడీ సెంటర్లను నిర్వహించిన శ్రీవేంకటేశ్వర ప్రస్తుతం చిత్తూరులోనే నిర్వహిస్తోంది. ఇక్కడ మరో మతలబు జరుగుతోంది.

గతంలో స్టడీసెంటర్లు నిర్వహించిన కొందరు ఇప్పటికీ విద్యార్థులతో ఫీజులు కట్టించుకొని, వారి పేరుతో వర్సిటీకి చెల్లిస్తున్నారు. పిల్లలు ఎక్కువగా ఉన్నారని పరీక్ష కేంద్రాలకు అనుమతి పొందుతున్నారు. విద్యార్థుల నుంచి అధికంగా వసూలు చేస్తున్నారు. గతంలో కర్నూలులో నిర్వహించిన పరీక్షల్లో చూచిరాతలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. శ్రీవేంకటేశ్వరకు చిత్తూరులో 14 స్టడీ సెంటర్లున్నాయి. శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ అనంతపురంలోనే అధ్యయన కేంద్రాలను కేటాయిస్తుండగా.. గత ఏడాది నుంచి సఫ్లిమెంటరీ పరీక్షలు నిర్వహించలేకపోతోంది. ద్రవిడ వర్సిటీకి అనుమతి లేక రెండేళ్ల క్రితం దూరవిద్యను నిలిపివేసింది. దూరవిద్యతో ఒకప్పుడు నాగార్జునకు రూ.60 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.

దూరవిద్యకో వర్సిటీ ఏదీ..?

ఉమ్మడి ఏపీలో దూరవిద్యకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉండగా.. విభజనలో అది హైదరాబాద్‌లో ఉండిపోయింది. కొత్తగా ఏపీలో వర్సిటీని ఏర్పాటు చేయలేదు. నాగార్జున వర్సిటీ గతేడాది జులై-ఆగస్టు వరకు హైదరాబాద్‌లో స్టడీ సెంటర్‌ను నిర్వహించగా.. తాజాగా ఫిబ్రవరిలో ఇచ్చిన ప్రకటనలో ప్రవేశాలు నిలిపివేశారు. మిగతా వర్సిటీలు హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. వర్సిటీలు రాష్ట్రంలో దూరవిద్యకు అనుమతులు తీసుకొని, నచ్చినచోట స్టడీ సెంటర్లకు అనుమతులు ఇస్తున్నారు తప్ప స్పష్టమైన విధానం ఉండట్లేదు.

ఇదీ చదవండీ... పరిషత్‌ ఎన్నికల్లో మందకొడిగా ఓటింగ్

ABOUT THE AUTHOR

...view details