ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాంగోపాల్ వర్మ సినిమాపై హైకోర్టులో వ్యాజ్యం - రాంగోపాల్ వర్మ సినిమాపై హైకోర్టులో వ్యాజ్యం

దిశ ఘటనపై రాంగోపాల్ వర్మ సినిమాపై తెలంగాణ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దిశ తండ్రి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. పరిశీలించిన ధర్మాసనం.. అభ్యంతరాలను సెన్సార్ బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని దిశ తండ్రికి సూచించింది. అభ్యంతరాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సెన్సార్ బోర్డును న్యాయస్థానం ఆదేశించింది.

disha-father-filed
disha-father-filed

By

Published : Oct 10, 2020, 1:50 PM IST

Updated : Oct 10, 2020, 2:09 PM IST

దిశ అత్యాచార ఘటన ఆధారంగా రాంగోపాల్ వర్మ సినిమా తీయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమె తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. సినిమా చిత్రీకరణ, విడుదలను ఆపాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, కమిషన్ వద్ద విచారణ పెండింగ్​లో ఉండగా సినిమా తీయడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. సినిమా తమ కుటంబాన్ని మనోవేదనకు గురి చేసేలా కనిపిస్తోందని.. ట్రైలర్​పై యూట్యూబ్​లో ఉన్న కామెంట్లు ఇబ్బందికరంగా ఉన్నాయని వాదించారు.

ఈ విషయం సెన్సార్ బోర్డు దృష్టికి రాలేదని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ తెలిపారు. అభ్యంతరాలను సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేయాలని దిశ తండ్రికి హైకోర్టు సూచించింది. ఫిర్యాదును వీలైనంత త్వరగా పరిష్కరించాలని సెన్సార్ బోర్డుకు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

దిశ సంఘటన నేపథ్యంలో సినిమా తీయడాన్ని ఆమె తండ్రి ఖండించారు. ప్రభుత్వం కల్పించుకుని ఈ సినిమాను వెంటనే నిషేధించాలని కోరారు. తమను సంప్రదించకుండా రాంగోపాల్ వర్మ సినిమా తీయడం తగదన్నారు. కుమార్తెను కోల్పోయి ఇప్పటికీ ఎంతో బాధపడుతున్నామని అవేదన వ్యక్తం చేశారు.

సమాజాన్ని చైతన్యపర్చేందుకు రాంగోపాల్ వర్మ సినిమా తీస్తున్నానని అంటున్నాడని.. తమకు జరిగిన అన్యాయాన్ని ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. అయన డబ్బుల కోసమే ఈ సినిమా తీస్తున్నాడని పేర్కొన్నారు. యూట్యూబ్‌లో పెట్టిన సినిమా ట్రైలర్‌పై వస్తున్న కామెంట్లు బాధపెడుతున్నాయని తెలిపారు.

ఇదీ చదవండి:ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

Last Updated : Oct 10, 2020, 2:09 PM IST

ABOUT THE AUTHOR

...view details