రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రతిపాదన.. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై.. జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇది ఆమోదయోగ్యమైన చర్య కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. రాజ్యసభ టీవీలో జరిగిన చర్చలో.. నిపుణులు 3 రాజధానులపై విస్పష్టంగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇది పూర్తి రాజకీయ నిర్ణయంగా కనిపిస్తోందని అన్నారు. జగన్ ప్రభుత్వం చెబుతున్నట్టు.. ఇది అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడే చర్య ఎంత మాత్రం కాదని స్పష్టం చేశారు. కార్యనిర్వాహక, శాసన రాజధానులు ఒకే చోట ఉంటేనే అభివృద్ధి సాధ్యమని.. పరిపాలనకూ సజావుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ద బిగ్ పిక్చర్.. పేరిట రాజ్యసభలో ఈ నెల 21న ప్రసారమైన కార్యక్రమంలో ఈ మేరకు చర్చ జరిగింది.
ఇది ఊహలకు అందని విషయం: కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి బీకే చతుర్వేది
ఇదో వ్యర్థమైన ఆలోచన అని.. అన్ని ప్రాంతాల అభివృద్ధికి 3 రాజధానుల ఏర్పాటు పరిష్కారమే కాదని కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి బీకే చతుర్వేది అన్నారు. వేర్వేరు చోట్ల రాజధాని అన్నది ఊహలకు అందని విషయంగా చెప్పారు. రాజధాని, హై కోర్టు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నా ఫర్వాలేదు కానీ.. శాసన, కార్యనిర్వాహక రాజధానులంటూ వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం సరైన ఆలోచన కాదన్నారు. "ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజధాని లఖ్‌నవూలో ఉంటే, హైకోర్టు అలహాబాద్‌లో ఉంది. మధ్యప్రదేశ్‌లోరాజధాని భోపాల్‌లో ఉంటే, హైకోర్టు జబల్‌పూర్‌లో ఉంది. గుజరాత్‌లో రాజధాని గాంధీనగర్‌లో ఉంటే హైకోర్టు అహ్మదాబాద్‌లో ఉంది. ఇలా రాజధాని ఒకచోట, హైకోర్టు మరోచోట ఉన్నా ఫర్వాలేదు. శాసన రాజధాని ఒకచోట, కార్యనిర్వాహక రాజధాని మరోచోట ఏర్పాటు చేయాలనుకోవడం చెడ్డ ఆలోచన" అని స్పష్టం చేశారు. కర్నూలులో హై కోర్టు, అమరావతిలోనే రాజధాని ఉండాలని స్పష్టం చేశారు. ఆర్థికంగా భారమైనా.. ఎగువ సభను కొనసాగిస్తేనే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒక చోటే ఉండాలి: ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్.సి.త్రిపాఠి
3 రాజధానుల నిర్ణయం వృథా.. అని ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్.సి.త్రిపాఠి తేల్చి చెప్పారు. శాసన రాజధాని నుంచి పరిపాలన వేరు చేయడం తగదన్నారు. ఇది ఆర్థికంగానూ భారమే అని చెప్పారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకే చోట ఉండాలని అన్నారు. అధికారం ఒకే ప్రాంతంలో ఉండాలని.... ఈ దిశగా అన్ని విభాగాలూ ఒకేచోట పనిచేయాలని చెప్పారు. న్యాయ వ్యవస్థ పని తీరు వీటికి భిన్నంగా ఉంటుందని.. చెప్పారు. చాలా రాష్ట్రాల్లో చారిత్రక కారణాల వల్ల.. రాజధాని, హైకోర్టులు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. ఎగువ సభలు రాష్ట్రాలకు అవసరమే అన్న ఆయన.. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ రంగం నుంచి వచ్చేవారితోపాటు వి విధ రంగాల నిపుణులు ఇందులో ఉంటారని చెప్పారు. అయితే... ఇది రాజకీయ పునరావాసం కాకూడదని అభిప్రాయపడ్డారు.