తెలంగాణ రాష్ట్రంలో అక్షరాస్యతలో వెనకబడిన ప్రాంతం జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు. ఆ ప్రాంతంలోని మారుమూల పల్లెటూరు చింతలకుంట. అక్కడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది అదే గ్రామానికి చెందిన శ్రీజ. కొద్ది నెలల కిందట మొక్కలు నాటేందుకు స్నేహితులతో కలిసి వెళ్లినప్పుడు.. మొక్క నాటిన గుంట పక్కన పాలిథిన్ కవర్ ఉండటాన్ని గమనించింది. అది గత ఏడాది మొక్క. దాని పక్కనే తీసి పారేసిన కవర్. నాటిన మొక్క చనిపోయింది. కాని ఏడాది గడిచినా.. పాలిథిన్ కవర్ మాత్రం అలాగే ఉండిపోయింది. చింతలకుంట నుంచి గద్వాలకు వెళ్తున్నప్పుడు నర్సీల పక్కన కుప్పలుగా పాలిథిన్ కవర్లను శ్రీజ గమనించింది.
కరగదు...పైగా హాని చేస్తుంది...
పాలిథిన్ భూమిలో కరగదు. పర్యావరణానికి సైతం హాని చేస్తుంది. అలాంటి వాటిల్లో మొక్కలు పెంచడం సబబేనా అని ప్రశ్నించుకుంది. దానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా కనిపెట్టాలనే ఆలోచనలో పడింది. గట్టు ప్రాంతంలో వేరుశనగ సాగు ఎక్కువ. వేరుశనగ భూమి లోపలే పెరుగుతుంది. భూమిలోనే నశిస్తుంది. అలాంటి వేరుశనగ పొట్టుతో పాలిథిన్ కవర్ లాంటిది తయారు చేస్తే ఎలాగుంటుందనే ప్రయోగం మొదలు పెట్టింది. వేరుశనగ పొట్టుకు ఇంకొన్ని కలిపి ఆ మిశ్రమంతో బయో డీగ్రేడబుల్ పాట్స్‌ను తయారు చేసింది. వాటిల్లో మొక్కల్ని పెంచింది. క్రమంగా అది విజయవంతమైంది.
ఇన్నోవేషన్ పోటీల కోసం...
పర్యావరణ పరిరక్షణ కోసం తాను కనిపెట్టిన ఆవిష్కరణను తెలంగాణ ఐటీ శాఖ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'ఇంటింటా ఇన్నోవేషన్' పోటీల కోసం పంపింది. రాష్ట్ర వ్యాప్తంగా 250 మంది తమ ఆవిష్కరణలను పంపగా... జోగులాంబ గద్వాల జిల్లా నుంచి శ్రీజ ఆవిష్కరణ... బయో డీ గ్రేడబుల్ పాట్స్ ఎంపికయ్యాయి.
బయో డీగ్రేడబుల్ పాట్స్ వాడిటమే ఉత్తమం..