కొవిడ్ సన్నద్ధత దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు, ఆక్సిజన్ పడకలు, కాన్సంట్రేటర్లు, డీ-టైప్ సిలిండర్లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఆసుపత్రిలోని పడకల ఆధారంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం మార్గదర్శకాలు జారీ చేసింది.
వంద పడకలు అంత కంటే ఎక్కువ ఉన్న ఆసుపత్రుల్లో నిముషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఆక్సిజన్ మాస్కు రెగ్యులేటర్లు.. కేటాయించిన ఆక్సిజన్‌తో కూడిన పడకలతో సమానంగా ఉండాలని స్పష్టం చేసింది. కాన్సంట్రేటర్లు, డీ-టైప్ సిలిండర్లు కూడా అంతే మొత్తం లో కలిగి ఉండాలని వెల్లడించింది. ఇక వంద కంటే తక్కువ పడకలు ఉన్న ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ లేకపోయినా పర్వాలేదని స్పష్టం చేసింది. ఇక కాన్సంట్రేటర్లు ఆక్సిజన్ పడకల సంఖ్యలో 50 శాతం ఉంటే చాలని పేర్కొంది.