కరోనా... ప్రపంచవ్యాప్తంగా మనుషుల జీవన శైలిలోకి ఆధునిక సాంకేతికతను బలవంతంగా చొప్పించేసింది. ఆర్థిక కార్యకలాపాలతో పాటు రోజువారీ వ్యవహారాలను కూడా సాంకేతిక పరికరాలు, డిజిటల్ వ్యవస్థలు, మొబైల్ యాప్లు, ఇతర ఆధునిక పరికరాలపై పూర్తిగా ఆధారపడుతున్న పరిస్థితి. విద్యార్థుల నుంచి వృద్ధుల వరకూ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. మొబైల్ ఫోన్లు, ఈమెయిల్స్ లాంటి సమాచార వినిమయంతో పాటు బ్యాంకింగ్ సేవల లాంటి ఆర్థిక కార్యకలాపాలు, క్రయవిక్రయాలు, విద్యాభ్యాసం, అధికారిక సమావేశాలు, రాజకీయ, ప్రభుత్వ సమావేశాలు, వినోదం, వైద్యంలో టెలిమెడిసిన్, డిజిటల్ పరికరాలు ఇలా రకరకాల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాధారణ జీవన శైలిలోకి చొచ్చుకొచ్చింది.
పెరిగిన డిజిటల్ లావాదేవీలు..
దేశవ్యాప్తంగా డిజిటల్ పరికరాల ద్వారా జరిగిన చెల్లింపులే కరోనా కాలంలో మూడింతలైనట్టుగా ఓ సర్వే చెబుతోంది. 2019-20లో 2 వేల 162 లక్షల కోట్ల రూపాయల విలువైన డిజిటల్ లావాదేవీలు జరిగాయి. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలలకే ఇది 3 వేల లక్షల కోట్ల లావాదేవీలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2025 నాటికి ఈ డిజిటల్ చెల్లింపులు 7092 కోట్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం 16.2 కోట్ల మొబైల్ ద్వారానే చెల్లింపులు చేస్తున్నట్టు గుర్తించారు. భారత్లో మొబైల్ , ట్యాబ్లు, ల్యాప్ టాప్ లేదా పర్సనల్ కంప్యూటర్ల ద్వారా అంతర్జాలాన్ని వినియోగిస్తున్న వారి సంఖ్య 56 కోట్లుగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి.
అన్నివర్గాల్లోనూ..!
కరోనా ప్రభావం కారణంగా అధికాదాయ వర్గాలతో పాటు అల్పాదాయ వర్గాలు కూడా తమ జీవన శైలిలోకి సాంకేతికతను చొప్పించినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. ఆరోగ్యపరమైన అంశాలు, విద్య, గృహావసరాలు, చెల్లింపుల్లోనూ, అలాగే రవాణా సదుపాయాలకు సబంధించి కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని, డిజిటల్ పరికరాలను వినియోగించినట్టుగా తేలింది. ఈ పరికరాల వినియోగం నాలుగైదు నెలలు మాత్రమే అనుకున్నప్పటికీ.. కరోనా కొనసాగుతుండటంతో వాటి వినియోగమూ ఎడతెరపి లేకుండా సాగుతోంది.