మొన్న రోడ్డును తవ్వి కంకర ఎత్తుకెళ్లారు. నిన్న హైకోర్టు న్యాయమూర్తుల భవనాలు, ఇతర నిర్మాణాల కోసం నిల్వచేసిన ఇసుక తోడుకెళ్లారు. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర సచివాలయం సమీపంలోనే నల్లమట్టి తవ్వి తీసుకెళ్లారు. వెలగపూడి సచివాలయం వెనుకభాగంలో ఈ 6 రోడ్డు సమీపంలోని భూముల్లో మట్టిని అర్ధరాత్రి సమయంలో కొందరు జేసీబీలతో తవ్వి ట్రాక్టర్లతో తరలించారు. విషయం తెలిసిన అమరావతి దళిత ఐకాస నాయకులు, రైతులు మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఘటనా స్థలానికి వెళ్లారు. వారిని గమనించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. వాహనాల లైట్లు ఆపేసి వెళ్లిపోయారని రైతులు చెప్పారు. మట్టి తవ్వకాలను నిరసిస్తూ రైతులు అక్కడే కొద్దిసేపు నినాదాలు చేశారు. అమరావతిని నాశనం చేసేందుకే ఇలా వరుస విధ్వంసాలకు ఒడిగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మేం రాగానే.. వాహనాలతో పరారీ: రైతు చిలకా బసవయ్య
సచివాలయం సమీపంలోనే నల్లరేగడి మట్టిని అక్రమంగా ట్రాక్టర్లతో తరలిస్తున్నారని అమరావతి దళిత ఐకాస నేత చిలకా బసవయ్య పేర్కొన్నారు. ‘మట్టి తవ్వుతున్న జేసీబీలను అడ్డుకోవడానికి వెళ్లగా.. లైట్లు ఆపేసి వాహనాలతో పరారయ్యారు. రహదారి వివరాలు తెలిపే బోర్డులనూ తొలగించడం దారుణం. అమరావతిలో కుంటలు, గోతులు గత ప్రభుత్వంలో చంద్రబాబు తీసినేవని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు నల్లమట్టి ఎవరు తీసుకెళ్లారు? మట్టిని తరలిస్తుంటే పోలీసు నిఘా ఏమైంది? రాజధానిలో తవ్వకాలు, అక్రమాలు జరగకుండా పర్యవేక్షించాలి’ అని డిమాండ్ చేశారు.
భూములు ఇచ్చింది దోచుకోవడానికా..?