తెలంగాణ ఎంసెట్‌లో కనీస మార్కులు సాధించినా.. ఇంటర్‌లో నిబంధనల మేరకు మార్కులు పొందినా.. వారికి ర్యాంకులు దక్కలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేల కుటుంబాల్లో బుధవారం కలకలం రేగింది. ర్యాంకులు రాకపోవడం వల్ల వందలాది విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి జేఎన్‌టీయూహెచ్‌లోని ఎంసెట్ కార్యాలయానికి చేరుకొని అధికారులతో మొరపెట్టుకున్నారు. ఇంటర్ హాల్‌టికెట్, ఇతర సమాచారాన్ని సరిగా నమోదు చేయకపోవడంతో ర్యాంకు కేటాయించలేదని, ఎంసెట్‌లో ఉత్తీర్ణులైనట్లు చూపామని అధికారులు వారికి సమాధానమిచ్చారు. అది తమ తప్పు కాదని, విద్యార్థుల పొరపాటే కారణమని చెప్పుకొచ్చారు.
హాల్‌టికెట్ నంబరు, ఇతర వివరాలను తప్పుగా నమోదు చేయడంతో ఏటా ర్యాంకుల సమస్య వస్తోంది. ఈసారి దాదాపు రెండువేల మందికి ర్యాంకులు దక్కలేదు. ఈనెల సెప్టెంబరు 14వ తేదీకి ఎంసెట్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్ పరీక్షలు పూర్తయ్యాయి. ఫలితాలను ఈనెల 6న వెల్లడించారు. అంటే 20 రోజుల తర్వాత విడుదల చేశారు. ఫలితాలు వెల్లడించే ముందు అధికారులు పరిశీలించినప్పుడు ఎంత మందికి ర్యాంకులు రావట్లేదో తెలుస్తుంది. ఈసారి ఎంసెట్‌లో ఉత్తీర్ణులైనా 9 వేల మందికిపైగా ర్యాంకులు కేటాయించలేదు. వీరిలో ఇంటర్‌లో కనీస మార్కులు రానివారు, ఉత్తీర్ణులు కాని వారితోపాటు హాల్‌టికెట్ వివరాలను తప్పుగా నమోదు చేసిన వారు ఉన్నారు.