Land Pass Book:పట్టాదారు పాసుపుస్తకాలు లేక తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం బాపల్లితండా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ గ్రామంలోని ఏ వ్యవసాయ భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు లేవు. ధరణి రికార్డుల్లోనే ఈ ఊరు పేరిట భూముల్లేవు. ఏళ్లుగా రైతులు సాగులో ఉన్నా ధరణి రికార్డుల్లో నిక్షిప్తం కాలేదు. దీంతో పట్టాదారు పాసుపుస్తకాలు లేక రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు అందడం లేదు.
పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పక్క ఊరి రైతుల పేరిట పంటను అమ్ముకుని.. వాళ్లు ఇచ్చినప్పుడు డబ్బులు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. పట్టాలు లేకపోవడం వల్ల పంటరుణాలు పొందలేకపోతున్నారు. భూముల్ని అమ్ముకుందామనుకున్నా.. పాసుపుస్తకాలు లేకపోవడంతో అమ్మడానికి వీలు లేకుండా పోయింది. 28 సర్వే నెంబర్లలో 549 ఎకరాలు సీలింగ్, 39 సర్వే నెంబర్లలో 350 ఎకరాలు పట్టా భూములున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
క్షేత్రస్థాయిలో సాగులో ఒకరుంటే, దస్త్రాల్లో అదే సర్వే నెంబర్‌లో వేరొకరున్నారు. సాగులో ఉన్న భూవిస్తీర్ణానికి.. దస్త్రాల్లో ఉన్న భూవిస్తీర్ణానికి పొంతన లేదు. చిక్కుముడుల కారణంగా భూములు ధరణి రికార్డుల్లో నమోదు కాకుండా అధికారులు నిలిపేశారు. కొందరు వారే సాగు చేసుకుంటున్నా .. దస్త్రాల్లోనూ సరిగ్గానే ఉన్నా కూడా వారికి సైతం పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వలేదు. దీంతో అర్హులైన రైతులు ధరణి రికార్డుల్లో నమోదు కాకుండా అన్యాయానికి గురయ్యారు.