ధనత్రయోదశి లేదా ధంతేరాస్.. దీపావళికి రెండు రోజుల ముంద వచ్చే ఈ పండగకు ఎంతో విశిష్టత ఉంది. ఉత్తరాదిన ఎక్కువగా జరుపుకునే ఈ పండగకు ఇటీవల కాలంలో దక్షిణాదిలోనూ మక్కువ పెరిగింది. ఆ రోజు బంగారం కొనుగోలు చేస్తే అదృష్టం, సంపద వస్తుందని నమ్మకంతో చాలా మంది ఓ సెంటిమెంట్‌గా భావిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవికి పూజ చేయడంతో అమ్మవారు ఇంటికి వస్తారని నమ్ముతారు. అందువల్ల ధంతేరాస్ రోజున చాలా మంది మహిళలు బంగారమో, వెండి వస్తువులనో కొనుగోలు చేస్తారు. వాటికి పసుపు, కుంకుమ రాసి.. అమ్మవారి పాదల చెంత ఉంచి పూలతో పూజ చేస్తారు. దీపావళి వేడుకలలో భాగంగా ఈ పండగను జరుపుకోవడం అనాదిగా వస్తున్నదే.
ఈసారి మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో పండుగ వాతావరణం లేదు. కొనుగోలు తగ్గడానికి ప్రధాన కారణం బంగారం, వెండి ధరలు పెరగడమే అనే వాదన వ్యాపారుల నుంచి వస్తోంది. ధరలు పెరగడంతో డిమాండ్ తగ్గందని అంటున్నా... కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక కష్టాలతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందనేది మరో అంచనా. దేశంలో 10 గ్రాముల 53 వేల రూపాయల వరకూ ఉంది. గత ఏడాది ధన త్రయోదశితో పోలిస్తే ఇది 35 శాతం ఎక్కువ. కిలో వెండి ధర 62 వేల రూపాయలకు చేరింది. ఈ ధరలు ఎంతకాలం నిలబడతాయో తెలియడం లేదు. కొవిడ్ వ్యాక్సిన్ వచ్చిన వెంటనే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే, వ్యాపార పరిస్థితులు బాగుపడతాయని అంచనా వేస్తున్నారు. ఈ కారణంతోనే ఏటా ధన త్రయోదశికి సెంటిమెంట్‌గా బంగారం లేదా వెండి కొనే వ్యక్తులు ఒకటికి రెండు సార్లు అలోచిస్తున్నారు.