ఐదు దేవాలయాలకు సంబంధించిన కేసులను ఈ రోజు పరిష్కరించామని డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. కర్నూలు జిల్లాలో మూడు, గుంటూరు గ్రామీణంలో ఒక కేసు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కేసును పరిష్కరించామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో విగ్రహాల ధ్వంసానికి సంబంధించి నరసరావుపేటలో కొన్ని అసత్య ప్రచారాలు జరిగాయన్నారు. నరసరావుపేటలోని కృష్ణవేణి కళాశాల ఆవరణలో ఉన్న సరస్వతి దేవి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగిందని చెప్పారు.
గతంలో విగ్రహం ఉన్న స్థలాన్ని ఓ కళాశాలకు అద్దెకు ఇచ్చామని.. యాజమాన్యం నిర్మించిన రేకుల షెడ్డులను తొలగించే క్రమంలో సరస్వతి దేవి విగ్రహానికి నష్టం వాటిల్లిందని స్థలం యజమాని తెలిపారన్నారు. ఎవరూ ఈ విగ్రహాన్ని ధ్వంసం చేయలేదని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తలన్నీ అవాస్తవాలని డీజీపీ తెలిపారు.