DGP Sawang Meets CM Jagan: ఉద్యోగుల చలో విజయవాడ పరిణామాల దృష్ట్యా.. ముఖ్యమంత్రి జగన్‌తో డీజీపీ సవాంగ్ భేటీ అయ్యారు. సుమారు అర గంట పాటు జరిగిన భేటీలో... ఛలో విజయవాడ అంశంపైనే చర్చ జరిగినట్లు తెలిసింది. పోలీసు నిర్భందాలు, ఆంక్షలు పెట్టినా ఉద్యోగుల పోరాటం విజయవంతం కావడంపై డీజీపీని సీఎం ప్రశ్నించినట్లు తెలిసింది. ఉద్యోగులకు పోలీసులు సహకరించారన్న విషయంపై చర్చించినట్లు సమాచారం.
విజయవాడకు చాలా తక్కువ మంది వస్తారని పోలీసులు అంచనా వేసినా... అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. సుమారు 4 కిలోమీటర్ల మేర ఉన్న బీఆర్టీఎస్ రోడ్డు నిమిషాల వ్యవధిలోనే ఉద్యోగులతో నిండిపోయింది. ఈ పరిణామాలన్నీ ఎలా జరిగాయనే అంశంపైనా డీజీపీని సీఎం వివరణ అడిగినట్లు తెలిసింది. ఉద్యోగుల రాకను అంచనా వేయడంలో ఇంటలిజెన్స్ వ్యవస్థ విఫలమైనట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. అందువల్ల ఇంటెలిజన్స్, నిఘా వ్యవస్థ పనితీరుపైనా చర్చించినట్లు తెలిసింది. చలో విజయవాడను అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు, తీసుకున్న చర్యలను సీఎంకు డీజీపీ సమగ్రంగా వివరించినట్లు సమాచారం. ఉద్యోగులు మారువేషాల్లో రావడం, ముందే విజయవాడ చేరుకుని బస చేయడం లాంటివి జరిగాయని తెలిపినట్లు సమాచారం. భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలనే విషయంపై డీజీపీకి సూచనలు చేసినట్లు తెలిసింది.