అత్యాచార కేసు నిందితుడు రాజు మృతిపై మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి హైదరాబాద్‌లోని సైదాబాద్ హత్యాచార ఘటన నిందితుడు రాజు ఆత్మహత్యపై ఎలాంటి అనుమానాలు లేవని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి(Dgp Mahender Reddy) స్పష్టం చేశారు. అతను ఆత్మహత్య చేసుకోవడం ఏడుగురు ప్రత్యక్షంగా చూశారని తెలిపారు. ఇద్దరు కోణార్క్ రైలు లోకో పెలట్లు, ఒక గాంగ్ మెన్, నలుగురు రైతులు ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారని చెప్పారు.
రైలు కింద రాజు పడటం చూసిన లోకో పైలట్లు.. సంబంధిత అధికారులకు తెలియజేశారని డీజీపీ(Dgp Mahender Reddy) వెల్లడించారు. అతను ఆత్మహత్యకు ముందు ట్రాక్‌పై తిరగడం గాంగ్ మెన్ చూశాడని తెలిపారు. రాజు ఆత్మహత్య చేసుకోవడానికి రైలు కిందపడటం అక్కడే పంట పొలాల్లో పనిచేస్తున్న రైతులు కూడా చూశారని చెప్పారు.
"రాజు ఆత్మహత్య విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. అతనిది వందశాతం ఆత్మహత్యే. రాజు రైల్వే ట్రాక్‌పై తిరగడం అక్కడున్న గాంగ్ మెన్ చూశాడు. వెంటనే అతణ్ని ప్రశ్నించగా.. పక్కనున్న చెట్ల పొదల్లోకి పారిపోయాడు. మళ్లీ కాసేపటికి తిరిగివచ్చిన గాంగ్‌మెన్‌కు పట్టాలపై పడి ఉన్న రాజు శవం కనిపించింది. అలాగే కోణార్క్ రైలు లోకో పైలట్లు కూడా రాజు రైలు కింద పడటం చూశారు. అక్కడే పంట పొలాల్లో పని చేస్తున్న రైతులు కూడా చూశారు. ఈ కేసులో ఏడుగురు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. వారి స్టేట్మెంట్ను వీడియో రికార్డు చేశాం. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. రాజు ఆత్మహత్య విషయంపై ఎలాంటి పుకార్లు పుట్టించొద్దు. ప్రజలకు లేనిపోని అనుమానాలు రేకెత్తించొద్దు."
- మహేందర్ రెడ్డి, తెలంగాణ డీజీపీ
ఇదీ చదవండి:Saidabad Incident: నా బిడ్డది ఆత్మహత్య కాదు.. చంపేశారు: రాజు తల్లి