మావోయిస్టు పార్టీకీ కంచుకోటగా ఉన్న తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఆ ఉనికి లేకుండా పోయింది. రాష్ట్రానికి ఛత్తీస్గఢ్, ఆంధ్ర సరిహద్దులుగా ఉన్న ప్రాంతాల్లో గ్రే హౌండ్స్ పోలీసులు నిత్యం కూంబింగ్ చేస్తూ మావోయిస్టులపై పైచేయి సాధించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దులు, నల్లమల అడవుల మీదుగా మావోయిస్టులు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉండటంతో.. పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఆయా ప్రాంతాల్లో మావోయిస్టుల సమాచార వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారు. 9 ఏళ్లుగా మావోయిస్టులను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తూ వస్తున్నారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్లై ఉండి ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్న మావోయిస్టు నాయకులను లొంగిపోయేలా చేయడంలో పోలీసులు సఫలీకృతమయ్యారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లో అప్పుడప్పుడు మావోయిస్టుల చిన్నాచితకా కార్యక్రమాలు తప్పితే, మిగతా జిల్లాల్లో ఆ ప్రభావమే కనిపించడం లేదు. గతేడాది మావోయిస్టు నాయకుడు రంజిత్, నెల క్రితం అతని తల్లి సావిత్రి.. తాజాగా తెనాలికి చెందిన ఉషారాణి అనారోగ్య కారణాలతో పోలీసులకు లొంగిపోయారు.