రాష్ట్రంలో ఆలయాలపై దాడుల కేసుల్లో 335 మందిని అరెస్ట్ చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇందులో 175 కేసులను చేధించామని చెప్పారు. 2020-21లో ఆలయాలపై దాడులకు సంబంధించి 44 పెద్ద ఘటనలు జరిగాయన్నారు. వీటిల్లో 29 కేసులను చేధించామని... 85 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు.
ఆలయాల భద్రత కోసం 23,256 గ్రామాల్లో 15,394 గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేశామని డీజీపీ తెలిపారు. ఇప్పటివరకు 58,871 ఆలయాలకు జియో ట్యాగింగ్‌తో అనుసంధానం చేశామని వివరించారు. 43,824 సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు నిరంతర నిఘా ఉంచామన్నారు. ఆలయాలపై దాడులు జరుగుతున్నాయన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు వెల్లడించారు. రామతీర్థంలోని ప్రధాన ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇందుకోసం ప్రత్యేకంగా 93929 03400 నంబర్‌ను అందుబాటులో ఉంచామని చెప్పారు.
ఆలయాల దాడుల అంశంపై పోలీసులు ఏం చేస్తున్నారని అంటున్నారు. అలాంటి వ్యాఖ్యలు చాలా బాధ్యాతరహితమైనవి. నిజనిజాలను బయటికి తీసుకొచ్చేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నాం. రాష్ట్రంలో మత సామర్యాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాటికి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నాం. ఇప్పటికే సామరస్య కమిటీలను తీసుకువచ్చాం. చాలా చోట్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. జియో ట్యాగింగ్ చేపట్టాం. మిగిలిన వాటిని కూడా అనుసంధానం చేస్తాం - గౌతమ్ సవాంగ్, డీజీపీ
దేవాలయాలపై దాడులకు సంబంధించి ఊహాగానాలు, పుకార్లు రేకెత్తించినా సామాన్యులు సంయమనంతో వ్యవహరించారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఈ సమయంలో పోలీసులపై వచ్చిన విమర్శలను ఆయన ఖండించారు. తన సర్వీసులో పోలీసులపై ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ వినలేదన్నారు. పోలీసులు కులాలు, మతాలకు అనుగుణంగా కాకుండా రాజ్యాంగానికి లోబడే పనిచేస్తారని తెలిపారు.