ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం ఘటనల్లో భాజపా నేతలకు ప్రమేయం ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పటం సిగ్గుచేటని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న పోలీసులు... వైకాపా కార్యకర్తల్లా పని చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆలయంపై దాడి చేశానని వైకాపాకు చెందిన ప్రవీణ్ చక్రవర్తి స్వయంగా ప్రకటించినా ఎందుకు చర్యలు తీసుకోలేదని విష్ణు ప్రశ్నించారు. ఆలయాలను పరిరక్షించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి ఒత్తిడితోనే 24 గంటల వ్యవధిలోనే డీజీపీ మాట మార్చారని పేర్కొన్నారు.
మరోవైపు... రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా డీజీపీ వ్యవహరిస్తున్నారని భాజపా రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ధ్వజమెత్తారు. భాజపా కార్యకర్తలు, సానుభూతిపరులపై కేసులు పెట్టడం దారుణమన్నారు. ఇప్పటికైనా ఆలయాలపై జరిగిన దాడులకు సంబంధించిన కుట్రలను ఛేదించాలని డిమాండ్ చేశారు.