ఓ ఎస్సై పదోన్నతి విషయమై దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్య విచారణకు డీజీపీ గౌతమ్‌సవాంగ్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ హైకోర్టుకు హాజరయ్యారు. గతంలో కోర్టుకు డీజీపీ హాజరైనప్పుడు.... సిన్సియర్ అనే భావనను వ్యక్తపరిచామన్న హైకోర్టు..... ఇప్పుడు బలవంతంగా దాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. మీ కార్యాలయంలో కిందిస్థాయి అధికారులు ఏం చేస్తున్నారో మీకు తెలియడం లేదని..... అక్కడి పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందని డీజీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వుల అమల్లో కిందిస్థాయి ఉద్యోగులు చూపుతున్న నిర్లక్ష్యం వల్ల......డీజీపీని మళ్లీ మళ్లీ కోర్టుకు పిలవాల్సి వస్తోందని పేర్కొంది. ఓ అధికారికి పదోన్నతి కల్పించినప్పటికీ.... తమ ఆదేశాల అమల్లో ఉద్దేశపూర్వక ఉల్లంఘన, నిర్లక్ష్యం, జాప్యం కనిపిస్తోందని ప్రాథమికంగా అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇందుకు కారణాలను వివరిస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
నేపథ్యమిదే..
ఎస్సై రామారావుకు సీఐగా పదోన్నతి కల్పించే ప్యానల్లో స్థానం కల్పించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు గతంలో ఉత్తర్వులిచ్చింది. వాటిని అమలు చేయకపోవడంతో రామారావు కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు..... హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, ఇతరుల హాజరుకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారు కోర్టుకు హాజరవగా..... తమ నోటీసును ఎప్పుడు అందుకున్నారని డీజీపీని ధర్మాసనం ప్రశ్నించింది. మీ అధికారులతో చర్చించడానికి ఇది మీ కార్యాలయం కాదని డీజీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. అన్ని వివరాలతో కోర్టు ముందుకు రావాలని పేర్కొంది.