జానకి దోసిట కెంపుల త్రోవై.. రాముని దోసిట నీలపు రాశై.. ఆణిముత్యములే తలంబ్రాలుగా.. అంటూ జగదభిరాముడి కల్యాణఘట్టాన్ని వర్ణించే భద్రాచలం తలంబ్రాలు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. సీతమ్మవారి మెడలో రామయ్య మంగళసూత్రం కట్టే అపురూప క్షణాల్లో ఈ తలంబ్రాల ప్రత్యేకతను చెబుతుంటారు. రోజూ జరిగే నిత్యకళ్యాణంలో వాడే తలంబ్రాలు పసుపురంగులో ఉంటాయి. కానీ, ఏడాదికొకరోజు జరిగే తిరుకళ్యాణ వేడుకలో ఉపయోగించే తలంబ్రాలు మాత్రం ఎరుపు రంగులో ఉంటాయి. రాములోరి చేతిలో నీలపు రాసులుగా.. సీతమ్మ చేతిలో పగడపు వర్ణముగా కనిపించే ఈ తలంబ్రాలకు వాడే వడ్లను చేతితో ఒలిచి.. ఆ బియ్యాన్ని భద్రాద్రి రామయ్యకు సమర్పిస్తారు.
ప్రత్యేకంగా పండించి..
అనాది కాలం నుంచి సీతారాముల కల్యాణ వేడుకకు భక్తులు గోటితో ఒలిచిన తలంబ్రాలను సమర్పిస్తున్నారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం స్వామివారికి సమర్పించే తలంబ్రాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. వాటి కోసం ప్రత్యేకంగా వరి పంట పండించి.. వడ్లను రెండు తెలుగు రాష్ట్రాల్లోని భక్తులకు పంపుతారు. వాటిని ఒలిచి బియ్యంలో పసుపు, కుంకుమ, అత్తరు, నెయ్యి, గులాం, ముత్యాలు కలిపి ఎరుపు రంగు తలంబ్రాలుగా తయారు చేసి కల్యాణంలో ఉపయోగిస్తారు.
భక్తుల నమ్మకం..
కల్యాణంలో ఉపయోగించిన అక్షతలను ధరిస్తే భార్యాభర్తల బంధం ఒడుదొడుకులు లేకుండా సాగుతూ.. అన్యోన్యతకు మారుపేరుగా నిలుస్తుందని భక్తుల నమ్మకం. సీతారాముల కల్యాణం కోసం ఈ ఏడాది దాదాపు 70 క్వింటాళ్ల తలంబ్రాలను తయారు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.ఇందులో వందకిలోల ముత్యాలను ఉపయోగిస్తుండగా.. ఇప్పటికీ లక్షవరకు ముత్యాల తలంబ్రాలు ప్యాకెట్లు సిద్ధం చేశారు.