ఇంపాక్ట్ ట్యాక్స్ పేరిట మరో బాదుడుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెరలేపారని.. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. శుక్రవారం మైలవరంలో పేదలకు అన్నక్యాంటీన్ ద్వారా అందించే భోజనం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే అనేక రకాల పన్నులు విధించి పేదవాడి నడ్డి విరుస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. ఇప్పుడు మరో పన్ను వేసి బాదుడే బాదుడు కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోడ్డుపక్కన ఏ చిన్న నిర్మాణాలు జరిపినా.. వారిపై ఇంపాక్ట్ ట్యాక్స్ పేరిట కొత్తగా పన్నులు వసూలు చేసే పనిలో ఉన్నారని మండిపడ్డారు. ఇప్పటికే రూ.20 వేల కోట్లు విద్యుత్ భారాలు పేదలపై మోపారని విమర్శించిన దేవినేని.. అది చాలదన్నట్టు కొత్త ట్యాక్సుల పేరుతో జనం జేబులు గుల్ల చేస్తున్నారని మండిపడ్డారు.