రివర్స్ టెండరింగ్ పేరుతో వైకాపా మంత్రులు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని తెదేపానేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. 2021 జూన్ లోపు పోలవరం పూర్తి చేస్తానన్న జగన్.. మాట తప్పారని విమర్శించారు. వెలగపూడిలో రైతులు నిర్వహించిన ధర్నాలో దేవినేని ఉమ పాల్గొన్నారు. రైతులకు మద్దతుగా సంఘీభావం ప్రకటించారు.
రైతులకు వ్యతిరేకంగా ప్రజాధనం వృథా..
రైతులకు వ్యతిరేకంగా న్యాయస్థానాలలో వాదించేందుకు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని ఉమ మండిపడ్డారు. రాబోయే బడ్జెట్లో న్యాయస్థానాల్లో వాదించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారని ఎద్దేవా చేశారు. మీరు ఇచ్చిన భూముల్లో కూర్చొని... మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం చెప్పాలని రైతులకు పిలుపునిచ్చారు. ఓవైపు రాష్ట్రంలో వరదలు వస్తుంటే నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నారని ఉమ ప్రశ్నించారు. వరదలపై ఎప్పటికప్పుడు సమీక్షించి నిర్ణయం తీసుకోకపోతే పెద్ద ఎత్తున పంట పొలాలు మునిగిపోయే పరిస్థితి వస్తుందన్నారు.
ఇవీ చదవండి:గోదావరిని వదలని వరద.. ఇంకా జలజీవనంలోనే బాధితులు