- వనదుర్గ.. ఘన శోభ
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఉత్సవ శోభ సంతరించుకోనుంది. దేవాలయంలో దేవి శరన్నవరాత్రులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆలయ ఈవో సార శ్రీనివాస్ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు.
గోకుల్ షెడ్‌లో పూజలు
నవరాత్రోత్సవాలను గోకుల్‌షెడ్‌లో నిర్వహించేందుకు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దీపాలు, రంగురంగుల కాగితాలు, అరటి కొమ్మలు, తోరణాలతో అలంకరించారు. సింగూరు నీరు ప్రవహిస్తుండటంతో ఈసారి ప్రధానాలయం జలదిగ్బంధంలో ఉంది. వరద తగ్గకపోతే రాజగోపురం వద్ద నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా షెడ్డులో ప్రతిష్ఠిస్తారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఉత్సవాలు ప్రారంభించనున్నారు. అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అవతారంలో దర్శనమివ్వనుంది. వరుసగా శైలపుత్రి, మహాలక్ష్మి, చంద్రఘంట, కూష్మాండ, కాత్యాయని, సరస్వతి, మహాగౌరి, సిద్ధిరాత్రి, శ్రీరాజరాజేశ్వరి రూపాల్లో అలంకరిస్తారు. ఆరో రోజున వనదుర్గకు బోనాలు సమర్పిస్తారు.
- విద్యాసరస్వతి.. నవార్చన ధాత్రి
విద్యుత్తు కాంతుల్లో వర్గల్ క్షేత్రం
వర్గల్: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం శంభుగిరి కొండలలో వెలసిన విద్యాసరస్వతి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆలయం ముస్తాబయింది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ నెల 7 గురువారం నుంచి తొమ్మిది రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు జరిపించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ యాయవరం చంద్రశేఖరశర్మ తెలిపారు. హైదరాబాద్‌కు 50 కి.మీ. దూరమే ఉండటంతో జంట నగరాల నుంచి ఎక్కువగా వచ్చి అక్షరాభ్యాసాలు చేయిస్తారు. సరస్వతి అమ్మవారి జన్మనక్షత్రం మూల సందర్భంగా ప్రతి నెల విశేష పూజలు జరుగుతాయి. నేటి నుంచి వరుసగా బాలత్రిపుర సుందరి, గాయత్రి, లలిత, అన్నపూర్ణ, మహాలక్ష్మి, సరస్వతి, దుర్గ, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి అవతారాల్లో దర్శనమిస్తారు. మహాభిషేకం, చతుష్షష్టి పూజ, పారాయణాలు నిర్వహిస్తారు.
- దశాబ్ద కాలం.. కాపాడేందుకు ఉత్సవం
వెలుగుల్లో పెద్దశంకరంపేట కోట
పెద్దశంకరంపేట: రాజ్యాలు పోయినా వారు నిర్మించుకున్న కళా సౌధాలు నేటి తరాలకు చారిత్రక సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. పెద్దశంకరంపేటలోని చారిత్రక శంకరమ్మ గడికోటను కాపాడుకోవాలనే లక్ష్యంతో గ్రామస్థులు ముందుకొచ్చి.. పదేళ్లుగా దేవి నవరాత్రోత్సవాలు నిర్వహిస్తూ కొత్త కళ తీసుకొస్తున్నారు. 18వ శతాబ్దంలో రాణి శంకరమ్మ సంస్థానంలో నల్లరాతి, డంగు సున్నం ఉపయోగించి 40 అడుగుల ఎత్తులో ఈ కోటను నిర్మించారు. అది శిథిలం కాకుండా ఉండేందుకు ఆషాఢమాసంలో మహంకాళి బోనాలు, దసరా సందర్భంగా అమ్మవారి ఉత్సవాలు చేస్తున్నారు. ఉత్సవ కమిటీగా ఏర్పడి పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. పురాతన కట్టడాలకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటించడంతో స్థానికుల్లో ఆశలు నెలకొన్నాయి. నిధులు వెచ్చించి పర్యాటక ప్రదేశంగా చేయాలని కోరుతున్నారు.
- అఖండ జ్యోతి.. ఒడి బియ్యం..
తాండూరులో కాళికాదేవి
తాండూరు టౌన్: తాండూరులోని కాళికాదేవి అమ్మవారి ఆలయంలో ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారుగా 400 ఏళ్ల క్రితం పురాతన ఆలయమిది. ప్రజలు గ్రామ దేవతగా కొలుస్తున్నారు. ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు. స్థానికమే కాకుండా చుట్టుపక్కల మండలాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ అధికారులు ఆలయాన్ని విద్యుత్తు దీపాలతో ముస్తాబు చేశారు. రోజూ రాత్రి 8 గంటలకు అమ్మవారికి మంగళ హారతి ఇస్తారు. రోజొక ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తారు. అఖండ జ్యోతి పారాయణం, ఒడి బియ్యం సమర్పణ, అక్షరాభ్యాసం, భజనలు, పల్లకి సేవ, దసరా వేడుకలతో తొమ్మిది రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- గిరిజన పుత్రులు.. భవాని దీక్షలు..
కంది, నారాయణఖేడ్: గిరిజన తండాలలో భవాని మాత దీక్షలు ‘జై భవానీ మాత.. జై సేవలాల్.. జై రాంరావు మహరాజ్’ అంటూ భక్తిశ్రద్ధలతో పూజలు కొనసాగుతున్నాయి. మద్యపానానికి, అబద్ధాలకు దూరంగా సన్మార్గంలో తమను నడిపించేందుకు దీక్షలు చేపడతామని వారు చెబుతున్నారు. 41, 21, 11 రోజుల్లోనూ దీక్ష తీసుకుంటారు. ఎర్రని చొక్కా, తెల్లని ప్యాంటు, లుంగీ, గులాబి కండువా, రుద్రాక్షమాల ధరిస్తారు. ఇళ్లకు దూరంగా ఉంటారు. విజయ దశమి రోజున మహారాష్ట్రలోని పౌరాలో కొలువైన అమ్మవారిని దర్శించుకుని దీక్షలు విరమిస్తారు. గురువు సంత్ తపస్వి శ్రీరాంరావు మహరాజ్ ఆదేశాల మేరకు నియమాలు పాటిస్తారు. రోజూ హోమం, ఉపవాసం, భజన ఉంటాయి. ప్రతి ఏడాది జిల్లాలో 800 తండాల్లో 20 వేలకు పైగా భవాని సేవాలాల్ దీక్షలు తీసుకుంటారని గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జైపాల్‌నాయక్ తెలిపారు. ఆధునిక, సాంకేతికాలు సమాజాన్ని ముంచెత్తుతున్నా యువ గిరిజనుల్లో ఆధ్యాత్మిక చింతన రోజురోజుకు పెరుగుతోంది. ప్రతిఏటా దసరాకు ముందు దీక్షలు చేపడతారు. చేతనైన సామగ్రి సాయం పేదలకు చేస్తుంటారు. దీక్షలు ముగిసే వరకు భోగ్‌భండార్‌లో భాగంగా భవాని మాత మందిరాల ముందు గోతులు తవ్వి కర్రలతో మంటలు మండిస్తారు. రాగి పాత్రలో రవ్వ, చక్కెర, ఆవు నెయ్యి, పదార్థాలో పాయసం వండుతారు. పాయసాన్ని మంత్రోక్తంగా అగ్నికి ఆహుతినిస్తారు.