బాపట్ల పురపాలక సంఘ ఎన్నికల్లో మొత్తం 34 వార్డుల్లో వైకాపాను ఏకగ్రీవంగా గెలిపించడానికి ప్రతిపక్షాలు సహకరించాలని ఉపసభాపతి కోన రఘుపతి విజ్ఞప్తి చేశారు. బాపట్లలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కౌన్సిలర్లతో పాటు ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ పదవుల్లో వైకాపాను ఏకగ్రీవంగా గెలిపించి సీఎం జగన్‌కు కానుక ఇవ్వడం ద్వారా బాపట్ల కేంద్రంగా కొత్త జిల్లాను సాధించుకుందాం. తెదేపా, జనసేనతో సహా ఇతర ప్రతిపక్షాలు ముందుకొచ్చి నా ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలి...’ అని ఆయన కోరారు. ‘ఎన్నికల్లో తెదేపా పోటీ చేస్తే పది వార్డులు వస్తాయి. ఒకవేళ అత్యధిక వార్డులు గెలిచి ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు దక్కించుకున్నా ఉపయోగం ఉండదు.
బాపట్ల పురపాలికను ఏకగ్రీవం చేయండి: ఉపసభాపతి
బాపట్ల పురపాలికను ఏకగ్రీవం చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి విజ్ఞప్తి చేశారు. వైకాపాను ఏకగ్రీవంగా గెలిచి సీఎం జగన్‌కు కానుక ఇవ్వటం ద్వారా బాపట్ల కేంద్రంగా జిల్లాను సాధించుకుందామని పిలుపునిచ్చారు.
డిప్యూటీ స్పీకర్ కోన రఘపతి
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటా. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తెదేపా నియోజకవర్గ అధ్యక్షుడు వేగేశ్న నరేంద్రవర్మరాజు, పార్టీ నేతలు పెద్ద మనసుతో వ్యవహరించి పురపాలిక ఎన్నికలకు అభ్యర్థులను పోటీకి దించకుండా సహకరించాలి. కొత్త జిల్లా కేంద్రంగా బాపట్లతో పాటు చీరాల పోటీ పడుతోంది. బాపట్ల కేంద్రంగా కొత్త జిల్లా సాధనకు అన్ని రాజకీయపక్షాలు, ప్రజా, వ్యాపార, వాణిజ్య సంఘాలు, సంస్థలు కలిసి రావాలని ఉపసభాపతి కోన రఘుపతి విజ్ఞప్తి చేశారు.