ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కాగ్​'తున్న అప్పులు.. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో కీలక పరిణామం

రాష్ట్ర అప్పులు, ఆర్థిక వ్యవహారాలపై కాగ్‌ కార్యాలయం మరింత దృష్టి సారించింది. ఏపీ ఆర్థిక వ్యవహార శైలిపై కార్యాలయానికి పదేపదే ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో దిల్లీ నుంచి నేరుగా కాగ్‌ కార్యాలయం తన డిప్యూటీ ఉన్నతాధికారి శ్రీనివాసన్‌ను పంపింది. ఆయన ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణలతో సమావేశమైనట్లు తెలిసింది.

'కాగ్​'తున్న అప్పులు.. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో కీలక పరిణామం
'కాగ్​'తున్న అప్పులు.. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో కీలక పరిణామం

By

Published : Jun 1, 2022, 4:54 AM IST

రాష్ట్ర అప్పులు, ఆర్థిక వ్యవహారాలపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) కార్యాలయం మరింత దృష్టి సారించింది. ఏపీ ఆర్థిక వ్యవహార శైలిపై కార్యాలయానికి పదేపదే ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో దిల్లీ నుంచి నేరుగా కాగ్‌ కార్యాలయం తన డిప్యూటీ ఉన్నతాధికారి శ్రీనివాసన్‌ను పంపింది. ఆయన ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణలతో సమావేశమైనట్లు తెలిసింది. మరోవైపు కాగ్‌లో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్‌ ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ (పీఏజీ) కార్యాలయం కోరిన పూర్తి సమాచారాన్ని సరైన సమయంలో రాష్ట్రం పంపనందున గత ఆర్థిక సంవత్సరం లెక్కలే ఇంకా తేలలేదు. వివిధ కార్పొరేషన్ల పేరుతో రుణాలు తెచ్చి రాష్ట్ర ప్రణాళిక కింద నిధులు వెచ్చిస్తున్నందున ఆ వివరాలు, పీడీ లెక్కల ఖాతాలను నివేదించాలని పీఏజీ కార్యాలయం లేఖలు రాసింది. ప్రతి నెలా రాష్ట్ర ఆదాయ వ్యయాలు, అప్పులు తదితర అంశాలను కాగ్‌ కార్యాలయం పరిశీలించి నివేదికలు విడుదల చేస్తుంది. ఈ లెక్కలనే కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అప్పుడే 2 నెలలు గడిచినప్పటికీ ఇప్పటికీ పాత లెక్కలను రాష్ట్రం ఖరారు చేయించుకోలేకపోయింది. అనేక రాష్ట్రాల తుది లెక్కలు ఇప్పటికే ఖరారయ్యాయి. కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన 2022-23 ఏప్రిల్‌ లెక్కలనూ కాగ్‌ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

అప్పుల కథ బయటపడేలా...బడ్జెట్‌లో చూపకుండా రుణాలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రణాళిక కింద ఖర్చు చేస్తున్న సమస్త వివరాలను తెలపాలని పీఏజీ కార్యాలయం పట్టుబడుతోంది. మే నెలాఖరులోగా సమాచారం పంపాలని, ఇది అత్యవసరంగా పరిగణించాలని సూచించింది. కార్పొరేషన్లకు గ్యారంటీలిచ్చి తీసుకొచ్చిన రుణాలు, వాటి ఖర్చుల వివరాలను తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఏపీఎస్‌డీసీ నుంచి రూ.వేల కోట్ల రుణం తెచ్చి సంక్షేమ పథకాలకు మళ్లించారు. ఇలాగే బేవరేజస్‌ కార్పొరేషన్‌, రాష్ట్ర ఫైనాన్షియల్‌ సర్వీసు, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్లవంటి వాటిని దీనికే వినియోగించుకున్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం.. ఒక రాష్ట్రం అభివృద్ధి రూపేణాగానీ, ఏ ఇతర రూపంలోగానీ చేసిన ఖర్చయినా.. ఆ ఏడాది బహిరంగ మార్కెట్‌ రుణ పరిమితికి ఎంత మేర అనుమతి ఉందో దాంతో కలిపి వచ్చే రాబడికే పరిమితమవ్వాలి. ఇతరత్రా బడ్జెట్‌లో చూపకుండా తీసుకొచ్చే రుణాలు.. ఏ ఆర్థిక సంస్థ నుంచి అనధికారికంగా తీసుకొచ్చే ఏ మొత్తమూ ఈ బడ్జెట్‌ ఖర్చుల్లోకి రాకూడదని పీఏజీ స్పష్టం చేసింది.

అప్పుల తిప్పలు...ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కోరినంత అప్పు దక్కలేదు. ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం.. ఇతరత్రా అన్నీ కలిపి రూ.61వేల కోట్ల వరకు రుణాలకు అనుమతించాలని ఏపీ కోరింది. కేంద్ర వ్యయ విభాగం అనేక ప్రశ్నలు సంధించి చివరకు రూ.28వేల కోట్లకే రుణపరిమితి ఇచ్చింది. ఇప్పుడు కాగ్‌ 2022 మార్చి నెలాఖరు వరకు పై అన్ని వివరాలతో లెక్కలు ఖరారు చేస్తే మొత్తం రుణం ఎంత తీసుకున్నారో అధికారికంగా తేలుతుంది. ఆ సందర్భంలో అప్పుల పరిమితిపై ప్రభావం పడే అవకాశముంది. దీంతో కాగ్‌ అడిగిన సమాచారమిచ్చేందుకు అధికారులు తర్జనభర్జన పడుతున్నందునే సమాచారం ఆలస్యమైందని తెలిసింది.

ఇదీ చూడండి..

రాష్ట్రం రూ.61వేలకోట్ల అప్పు అడిగితే.. కేంద్రం మాత్రం..

ABOUT THE AUTHOR

...view details