2020-21 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన పన్నులు కరోనా నేపథ్యంలో మందగించిన విషయం తెలిసిందేనని.. అధికారులు రాబోయే సెప్టెంబర్ మాసం నుంచి సామరస్యంతో కూడిన ప్రత్యేక కార్యాచరణతో పన్నుల వసూళ్లుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి ఆదేశించారు. శుక్రవారం తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల, డివిజన్ల కమర్షియల్ టాక్స్ అధికారులతో ఉపముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. విజయవాడ నుంచి స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, కమర్షియల్ టాక్సెస్ రజత్ భార్గవ్ పాల్గొని సమీక్ష నిర్వహించారు.
పన్నుల వసూలు ప్రగతిపై సమీక్ష
కరోనా మహమ్మారి వల్ల తగ్గిన పన్నుల వసూలుపై సెప్టెంబర్ నుంచి దృష్టి పెట్టాలని... ఇక మనకు ఉన్నది 7 నెలల సమయం మాత్రమే అని గుర్తించాలని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. డివిజన్ల వారీగా పన్నుల వసూళ్ల ప్రగతి పై ఆయన సమీక్షించారు. డిపార్ట్మెంట్లో అర్హత వున్నవారికి ప్రమోషన్లు ఇవ్వడం జరిగిందని... అంతే ఉత్సాహంతో పని చేసి పెండింగ్ బకాయిలపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. పన్నుల బకాయిలతో రెవెన్యూ రికవరీ చట్టం క్రింద ఆస్తుల వేలం వున్న వారితో మరొకసారి మాట్లాడాలని, ఆవరసరాన్ని బట్టి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వన్ టైమ్ సెటిల్మెంట్ చేసే విధంగా పరిశీలన చేయాలన్నారు.