జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీతో రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. కడప నగరంలోని జయనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విద్యాకానుక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు, బూట్లు, ఏకరూప దుస్తులు, ఇతర సామాగ్రితో కూడిన కిట్లను అందజేశారు.
కుల, మతాలకు అతీతంగా రాష్ట్రంలోని విద్యార్థులంతా ఇవాళ పండగ చేసుకుంటున్నారని ఉపముఖ్యమంత్రి అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలంటేనే విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉండేదని... వర్షం వస్తే తరగతి గదులు తడిసి ముద్దయ్యేవని గుర్తు చేశారు. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు నాడు-నేడు పథకం కింద పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా మార్చాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.