రాష్ట్రంలో తెదేపా చిల్లర రాజకీయాలు చేస్తోందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆరోపించారు. కుల, మత రాజకీయాలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పని చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా.. వైకాపా నాయకులు, ప్రభుత్వంపై నెట్టడం తెదేపాకు పరిపాటిగా మారిందన్నారు. నందం సుబ్బయ్య హత్య కేసులో ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డిపై ఆరోపణలు చేయడం సరికాదని తెలిపారు. 14 కేసులు కలిగి, క్రిమినల్ రికార్డు ఉన్న సుబ్బయను ఎవరు హత్య చేశారో ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.
సుబ్బయ్య హత్య కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా.., ఎంతటివారు ఉన్నా నిష్పక్షపాతంగా విచారణ జరుపుతామని అంజాద్ బాషా స్పష్టం చేశారు. తెదేపా హయాంలో ప్రభుత్వ అధికారులపై ఎమ్మెల్యేలు దాడులు చేసినా.. కనీసం కేసులు కూడా నమోదు చేయలేదని గుర్తు చేశారు. నెల్లూరులో జరిగిన ఒక సంఘటనలో వైకాపా ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని చెప్పారు. తమ ప్రభుత్వంలో ఏదైనా నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని అన్నారు.