జలవిద్యుత్ పై కృష్ణా బోర్డు ఆదేశాలను తెలంగాణ పట్టించుకోలేదని కేంద్రం వెల్లడించింది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు.. జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. శ్రీశైలం, సాగర్, పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని అనేక సార్లు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ బేఖాతరు చేసిందని పేర్కొంది. తెలంగాణ ఏకపక్షంగా ఉత్పత్తి చేస్తున్నట్లు సీఎం జగన్ లేఖ రాశారని జలశక్తి శాఖ తెలిపింది.
శ్రీశైలం ఎడమ కేంద్రంలో ఉత్పత్తి ఆపాలని జూన్ 17 ఆదేశించిందని.. బోర్డు ఆదేశాలు ఇచ్చే వరకు ఉత్పత్తి చేయవద్దని లేఖలో సూచించినట్లు జలశక్తి శాఖ పేర్కొంది. కేఆర్ఎంబీ ఆదేశించినా తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి చేసిందన్న కేంద్రం.. విద్యుదుత్పత్తి ఆపాలని జూలై 15 న తెలంగాణను బోర్డు ఆదేశించినట్లు వివరించింది.