కరోనా నేపథ్యంలో మూసివేసిన బడులను తెలంగాణ ప్రభుత్వం తాజాగా పునఃప్రారంభించింది. ఇంకా కొవిడ్ ఉద్ధృతి తగ్గలేదని... పాఠశాలలు కొన్ని మార్గదర్శకాలు పాటించాలని విద్యాశాఖ సూచించింది. ఈ నేపథ్యంలో పాఠశాలల ప్రాంగణాల్లో విద్యార్థులు ఉమ్మి వేయరాదు.. అసెంబ్లీ, ఆటలు నిషేధం చేస్తూ మార్గదర్శాకాలు ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యక్ష తరగతుల నిర్వహణ కోసం వారం రోజుల్లో నియమావళి జారీ చేయాలని గత నెల 31న హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలోనే కొవిడ్ నివారణ చర్యలు, యాజమాన్యాలు చేయాల్సిన ఏర్పాట్లు, మధ్యాహ్న భోజనం సమయంలో పాటించాల్సిన నియమాలు, బస్సుల్లో పాటించాల్సిన నిబంధనలు, విద్యార్థులు/ సిబ్బంది కొవిడ్ బారినపడితే ప్రధానోపాధ్యాయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితరాలపై విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
కొవిడ్ నివారణకు..
బడిలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి, అందరూ మాస్కులు ధరించాలి, తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవాలి, దగ్గరలోని పీహెచ్‌సీ సిబ్బందితో అందరి ఆరోగ్యాన్ని పరీక్షించాలి. ఉమ్మి వేయడం నిషేధం.
బడికి రమ్మని బలవంతం వద్దు..
- విద్యార్థులను ప్రత్యక్ష తరగతులకు రావాలని బలవంతం చేయరాదు.
- చదువులో వెనకబడిన వారికి బ్రిడ్జి కోర్సు రూపొందించాలి.
- అసెంబ్లీ, గ్రూపు వర్క్, ఆటలు నిషేధం.
- బడిలోకి వచ్చేముందు విద్యార్థులు, సిబ్బంది, ఉపాధ్యాయుల్లో కొవిడ్ లక్షణాలు ఉన్నాయేమో పరిశీలించాలి.
- రోజూ తరగతి గదులను క్రిమిరహితం చేయాలి.
- తల్లిదండ్రులకు కొవిడ్‌పై అవగాహన పెంచేలా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి.
- పెన్నులు, పెన్సిళ్లు, పుస్తకాలు, ఆహారం, మంచినీటి సీసాలు, గ్లాసులు, పళ్లాలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోకూడదు.